CM KCR: పాలమూరు ప్రాజెక్టును బీజేపీనే అడ్డుకుంటోంది.. సన్నాయి నొక్కులు నొక్కుతోంది..
CM KCR: వికారాబాద్ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
CM KCR: వికారాబాద్ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టును బీజేపీనే అడ్డుకుంటోందని, ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువుగా మారారని ఆరోపించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ పోయి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని అందువల్ల వికారాబాద్ జిల్లాకు నీరు అందడం లేదని మోడీని పశ్నించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఊరికే రాలేదని, చావు అంచు దాకా వెళ్లి రాష్ట్రాన్ని సాధించానని అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఎవడు పడితే వాడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. మన బాధలు చూడనివారు, మన అవస్థలు పట్టించుకోనివారు, నవ్వినవారు ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.
కేంద్రం మేలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉచితాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. కరెంట్ బిల్లులు వసూలు చేయాలని రైతుల మెడపై కత్తి పెట్టారని అన్నారు. కరెంట్ బావుల దగ్గర మీటర్లు పెట్టడం ద్వారా మనకు శఠగోపం పెట్టి.. పెద్ద షావుకార్ల కడుపు నింపాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.
మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని నల్లాలతో ప్రతి ఇంటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. అలాగే ఒంటరి మహిళలకు, భర్త చనిపోయిన ఆడవాళ్లకు, వృద్దులకు ఇచ్చే పెన్షన్ గతంలో రెండు వందలు ఉండేదని, ఇప్పుడు రెండువేల 16 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు సీఎం. కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేశామన్నారు. పేదింటి ఆడబిడ్డలను కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో ఆదుకుంటున్నామని చెప్పారు సీఎం కేసీఆర్.