Telangana: కేసీఆర్ వ్యూహం సక్సెస్

Telangana: 'బలిపశువు' విమర్శలు పటాపంచలు * ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుబాళించిన గులాబీ

Update: 2021-03-21 02:38 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: కేసీఆర్ రాజకీయాలు ఎప్పులు డైనమిక్‌గా ఉంటాయి. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి వ్యూహాలు మారుతుంటాయి. గెలుపు పాచికలు పారుతుంటాయి. ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీనే అమలు చేశారు కేసీఆర్‌. రాజకీయ చదరంగంలో వేగంగా పావులు కదిపి విపక్షాలను ఇరకాటంలో పెట్టారు. గులాబీ బాస్‌ సంధించిన బ్రహ్మాస్త్రానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చితికలిపడ్డాయి. ఇంతకి కేసీఆర్‌ వదిలిన గెలుపు బాణం ఎంటీ? టీఆర్ఎస్‌కు విజయం తీసుకొచ్చిన వ్యూహాలేంటీ?

ఎవ్వరూ ఊహించని ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్‌ దిట్ట. తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా కేసీఆర్‌ ముందుకెళ్లారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీకి చెక్ చెప్పడమే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహాలు రచించారు. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం వెనక కేసీఆర్‌ చాణిక్యత ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ బ్రహ్మాస్త్రం వదిలింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఓ ముఖ్యమైన ఆయుధాన్ని సంధించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలకం. అందుకే వారిని ఆకట్టుకునేందుకు ఉద్యోగుల పీఆర్సీ పెంపు విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ వ్యూహం ఎన్నికల్లో బాగా పని చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

దుబ్బాక,జీహెచ్ఎంసీ మినహా అంతకుముందు జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ గెలుచుకోలేకపోయింది. గతంలో ఇక్కడినుంచి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తెను ఇక్కడినుంచి బరిలో దింపడం కలిసొచ్చింది. అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేసినా బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టడంతో విజయం టీఆర్ఎస్‌నే వరించింది.

కాంగ్రెస్ పార్టీ పీఎంగా పని చేసిన నాయకుడి కుమార్తె వాణిదేవిని రంగలోకి దింపి కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టారు. అటు బీజేపీ సంగతి కూడా అంతే. బీజేపీ అంటే ఇష్టపడే సామాజిక వర్గానికి చెందిన వాణి కి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ వుంటుంది. అలాగే పివి అంటే వర్గాలు, పార్టీలకు అతీతంగా అభిమానించేవారు వున్నారు. పట్టణ ఓటర్లు, యువతలో కూడా పివి అంటే అభిమానించేవారు ఇప్పటికీ వున్నారు. వీరు సహజంగా బీజేపీ అంటే కూడా అభిమానంతో వుంటారు. వీరందరినీ డైలామాలో పడేసి ఓట్లల్లో చీలిక తీసుకొచ్చే ప్లాన్‌ సక్సెస్‌ ఫూల్‌గా అమలు చేశారు కేసీఆర్‌.

నిజానికి సురభి వాణీదేవీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కేసీఆర్ ఆమెను బలిపశువును చేయబోతున్నారన్న విమర్శలు వినిపించాయి. టీఆర్ఎస్‌కు బలం లేని చోట పీవీ కుమార్తెను పోటీకి దింపి కేసీఆర్ ఆమెను బలి చేయబోతున్నారని చాలామంది విమర్శించారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు.

ఈ విజయం పార్టీ శ్రేణుల్లో మంచి జోష్‌ నింపింది. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని టిఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న ఎంతమాత్రం కూడా టిఆర్ఎస్ పార్టీకి ధీమా పనికిరాదు అంటూ కొంతమంది హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కష్టం. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే దాని పైనే చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చూడాలి సాగర్‌ పోరును కేసీఆర్‌ ఎలా రక్తికట్టిస్తారో. 

Tags:    

Similar News