కేంద్రంపై మరోసారి వార్ ప్రకటించిన గులాబీ బాస్.. నేడు ఢిల్లీకి మంత్రుల బృందం
KCR: ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిలదీయాలని పిలుపు...
KCR: కమలంతో తాడో పేడో తేల్చుకోవాలని గులాబీ పార్టీ డిసైడ్ అయ్యింది. వరి ధాన్యం సేకరణపై కేంద్రం దిగొచ్చేలా వార్‌కు రెడీ అవుతోంది టీఆర్ఎస్. మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు.. క్షేత్ర స్థాయిలో ఆందోళనలకు పిలుపు నిచ్చింది.
వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేయాలని గులాబీ బాస్ ఎజెండా ఫిక్స్ చేశారు. ఈ నెల 20న గ్రామ స్థాయి నుంచి బీజేపీ లక్ష్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రైతులను సమీకరించి నల్ల జెండాలు, చావు డప్పు వంటి నిరసన కార్యక్రమాలతో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రైతులతో కోటి సంతకాల సేకరణ చేసి ఢిల్లీకి సెగ తగిలేలా చేయాలని ప్లాన్ వేశారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై దండయాత్రేనన్న సంకేతాలు ఇచ్చారు.
టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం సుదీర్ఘంగా సాగింది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి పైనే కేసీఆర్ హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళమంత్రుల బృందాన్ని ఢిల్లీకి వెళ్లాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి తాడో పేడో తేల్చుకుని రావాలని... సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోవాలని మంత్రులకు హితవు చెప్పారు.
ఇక వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలు, రైతు బంధు సమితి అధ్యక్షులకు కేసీఆర్ సూచించారు. అదే సమయంలో రైతు బంధు మీద అపోహలు వద్దని.. యధావిధిగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దళితబంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు.
ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ జిల్లాల పర్యటన వాయిదా పడింది. నిరసనల తర్వాత ఈ నెల 23న నుంచి జిల్లాల పర్యటనలు మొదలు పెట్టనున్నారు కేసీఆర్.