KCR wants to give Bharat Ratna to PV Narasimha Rao : పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం
KCR wants to give Bharat Ratna to PV Narasimha Rao : ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భారత పూర్వ ప్రధాని పీవీ శత జయంతి చరిత్రలో విశిష్ట సందర్భంగా ఉండాలి. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థలో పురోగమించడానికి పీవీ కారణం. ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది. దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రధాని పదవికి చేపట్టిన మొట్టమొదటి దక్షిణాది వ్యక్తి. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక రథాన్ని పీవీ ప్రగతి రథంలో పరుగులు పెట్టించారు. ప్రపంచం నలుమూలల నుంచి దేశానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణంగా పీవీనే. పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు. నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. భూసంస్కరణలను చిత్తశుద్దితో అమలు చేశారు. పీవీ ప్రధానిగా బాద్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో సతమతవుతోంది.
రాజకీయాలతో సంబంధంలోని ఆర్థికవేత్త మన్మోహన్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి పీవీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సగటు భారతీయుని జీవన శైలి మారడంలో కూడా పీవీ దార్శనికత ఉంది. దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘతన పీవీదే. దాదాపు మూడు దశాబ్దాలు చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండడానికి పీవీనే కారణం.సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక గమనాన్ని మార్చివేశారు. గ్లోబల్ ఇండియా రూపశిల్పి పీవీ. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నాం. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి దేశ ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించి పరుగులు తీయించారు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన రెండో వ్యక్తి పీవీ.
రాష్ర్ట విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఈ విద్యాలయాల్లో చదివిన వారు ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. తెలుగు అకాడమీని నెలకొల్పిన ఘనత కూడా పీవీకే దక్కుతుందన్నారు. రాజకీయాల్లో మునిగితేలుతూనే వేయి పడగలు అనే నవలను హిందీ భాషలోకి అనువాదం చేశారు. ఈ నవల ఇతిహాసం వలే ఉంటుంది. మహోన్నత తాత్వికవేత్త. అఖండమైన పాండిత్యం ఉన్న వ్యక్తి. పీవీ వ్యక్తిత్వం సమున్నత వ్యక్తిత్వం. ఈ నవలతో పీవీ పాండిత్యం ఏమిటో అర్థమవుతుంది. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉన్నది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది.