Huzurabad: హుజురాబాద్‌లో పాత ఫార్ములా అమలుచేస్తున్న కేసీఆర్
Huzurabad: ప్రత్యర్థులకు అంతుచిక్కని నిర్ణయాలు తీసుకోవడంలో గులాబీ బాస్ కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు.
Huzurabad: ప్రత్యర్థులకు అంతుచిక్కని నిర్ణయాలు తీసుకోవడంలో గులాబీ బాస్ కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్ మీద ఎవరూ పైచేయి సాధించే పరిస్థితి లేదంటారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు విపక్షాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆఖరికి అభ్యర్థి విషయంలో కూడా కేసీఆర్ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. కేసీఆర్ వ్యూహాలపై స్పెషల్ రిపోర్ట్.
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రచించే వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించడానికి గులాబీ బాస్ వ్యూహ రచన పూర్తయింది. గతంలో ఒక సీనియర్ నాయకుడి మీద ఈటలను నిలబెట్టి గెలిపించిన కేసీఆర్ ఇప్పుడు సీనియర్‌గా ఎదిగిన ఈటల మీద యువకుడిని నిలిపి దెబ్బతీయడానికి సిద్ధమయ్యారు. గతంలో అనేకసార్లు అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు హుజురాబాద్‌లో అమలుచేయడానికి నిర్ణయించారు కేసీఆర్. అందులో భాగంగానే టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేత అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఈటల మీద అభ్యర్థిగా ప్రకటించారు.
ఈటెల తో పోల్చితే గెల్లు శ్రీనివాస్ వయసులో, రాజకీయ అనుభవంలో చాలా చిన్న స్థాయి నేత. క్లీన్ ఇమేజ్ తో వస్తున్న గెల్లు శ్రీనివాస్ పై ప్రత్యర్థులకు ఆరోపణలు చేసే అవకాశం లభించదు మరోవైపు తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలకంగా పని చేసి కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపి రావడంతో ఇక ప్రతిపక్షాలకు తెలంగాణ ఉద్యమ విషయంలో కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. ఈటెలపై పోటీకి గెల్లు శ్రీనివాస్ ఎంపిక చేయడమే మానసికంగా దెబ్బ కొట్టే ఆలోచనగా భావిస్తున్నారు. చిన్న స్థాయి నేతను బరిలో దింపి ఈటెలను మట్టికరిపిస్తే ఆ ప్రభావం బీజేపీ పై కూడా పడుతుందని కేసీఆర్ ప్లాన్‌గా చెబుతున్నారు. అయితే గెల్లుపై ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ ఎన్నికను ఎదుర్కోవడంలో అనేక అనుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగప్రవేశంతో హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపెయిన్ తీరు మారిపోయింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉరకలెత్తే ఉత్సాహంతో పని చేస్తున్నారు. పేరుకు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అయినా ప్రచారం అంతా కేసీఆర్ పేరు మీదే సాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మండలాలు, గ్రామాల వారిగా మకాం వేసి కొన్ని వారాలుగా గట్టి ప్రచారం చేస్తున్నారు. ఇక అభ్యర్థి పేరు కూడా ఖరారు కావడంతోమరింత దూకుడుగా ప్రచారం నిర్వహించనున్నారు. అభ్యర్థి ప్రకటన రోజు ఒక్కసారిగా అన్ని మండలాలను గులాబీ శ్రేణుల రోడ్డు షోలతో హోరెత్తించారు. తమ సిట్టింగ్ స్థానాన్ని గులాబీ ఖాతాలోనే వేసుకునేందుకు పక్కా ప్లాన్‌తో టీఆర్‌ఎస్ శ్రేణులు పనిచేస్తున్నాయి.
మొత్తానికి ఇప్పటికిప్పుడే ఎన్నికలు ఎదుర్కొవడానికి అన్ని వర్గాలు సిద్ధమయ్యాయి. ఈటెల కూడా తన పట్ట సడలకుండా జాగ్రత్తలు పడుతున్నారు. గులాబి పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే కసితో పనిచేస్తోంది. గత ఉప ఎన్నికల స్ట్రాటజీతోనే బరిలో బిసి సామాజిక వర్గం నుంచి యువ నేత గెల్లు శ్రీనివాస్ బరిలో దింపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.