ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్ 9న నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం అక్టోబర్ 14లోపు ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా ఈ స్థానానికి ఏప్రిల్ 7న పోలింగ్ జరగాల్సి ఉంది. ఇంతలోగా లాక్డౌన్ అమలులోకి రావడంతో పోలింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుందని అందరూ భావించారు. తాజాగా అక్టోబర్ 9న పోలింగ్, 12న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 14న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది.
తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎ్‌సకు చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమే కానుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 570 మంది టీఆర్ఎస్కు చెందిన వారే. కాంగ్రెస్ పార్టీకి 152 మంది ఉండగా, బీజేపీ నుంచి 78 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే మరో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వతంత్రులు ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న 570 మందితో పాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇటీవల కారెక్కారు. దీనికి తోడు స్వతంత్రులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కవిత గెలుపు ఏకపక్షం కానుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా మొదట్లో ఈ ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిగా పోతనకర్ లక్ష్మినారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి నామినేషన్లు వేసిన విషయం విధితమే. ఈ ఎన్నికల్లో కవిత విజయంసాధిస్తే తొలిసారి మండలిలోకి అడుగుపెట్టనున్నారు.