ఈ నెల చివరి వారంలో ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. నీట్ ఫలితాలు ఈ నెల 16న వెలువడినా రాష్ట్రానికి ర్యాంకుల సమాచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటి వరకు పంపలేదు. దరఖాస్తుల స్వీకరణ నోటిఫికేషన్‌ను అలాగే రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితాను ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం (230) సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు మినహాయించి ఆలిండియా కోటాకు ఇస్తున్నారని తెలిపారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరిగాయి. టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీకి అనుమతి తాజాగా రావడంతో 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ప్రైవేట్, మైనారిటీ, ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి.
ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పరీక్షలు మరో సారి వాయిదా పడ్డాయి. ఓయూ పరిధిలో ఈ నెల 19 నుంచి 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 22 నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇతర పరీక్షలు కూడా వాయిదా పడ్డాయని వస్తున్న వదంతుల్లో నమ్మకూడదని తెలిపారు. ఇతర వివరాల కోరకు ఓయూ అధికార వెబ్ సైట్ లో చూడవచ్చునని తెలిపారు.