షర్మిల పార్టీలో చేరతాననడం బూటకం- టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Thatikonda Rajaiah: సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.
Thatikonda Rajaiah: సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను తాను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారన్నారు. గతంలో ఓ మతం సమావేశం కోసం వెల్లిన సందర్భంగా కలిసిన ఫోటోను వైరల్ చేశారన్నారు. వైఎస్సార్ పై అభిమానం ఉన్నది వాస్తవమేనని వైఎస్ తనకు టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. సోనియా గాంధీ ప్రవర్తన వల్ల తెలంగాణ కోసం జగన్ ని పక్కనబెట్టి బయటకు వచ్చానని తెలిపారు. జగన్ లేదా- తెలంగాణనా అంటే తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు ఎమ్మెల్యే రాజయ్య.
టీఆర్ఎస్ లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా, ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖను, డిప్యూటీ సీఎం హోదాను కేసీఆర్ తనకు కల్పించారన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుగుదల మాత్రం టీఆర్ఎస్ వల్లేనని తన జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
రాజకీయంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయని దీన్ని రాజకీయం చేయొద్దన్నారు. తప్పుడు ప్రకటనలు చేసి మనోభావాలను- మనసును గాయం చేయొద్దని సూచించారు. వైఎస్సార్ తో సన్నిహిత సంబంధాలే ఇలాంటి వార్తలకు కారణం అవుతున్నాయని కావాలనే కొందరు పనిగట్టుకొని ఇలాంటి వార్తలను రాస్తున్నారని విమర్శించారు. ఎలాంటి అసంతృప్తిలో లేను- చాలా తృప్తిగా ఉన్నానని వివరించారు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. చివరి ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానన్న ఆయన షర్మిలను కలవలేదని అలాంటి అవసరం రాలేదన్నారు.