శ్రీ కృష్ణా జ్యువెలర్స్‌లో రూ. 6 కోట్ల ఆభరణాలు మాయం.. కట్‌చేస్తే.. మేనేజర్ మిస్సింగ్.. అసలేమైందంటే?
6 కోట్ల విలువైన ఆభరణాలు మాయమైనట్టు శ్రీ కృష్ణ జ్యువెలర్స్ యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Sri Krishna Jewellers: బంజారాహిల్స్‌లోని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షాప్‌లో ఆభరణాల మిస్సింగ్ కలకలం రేపుతుంది. 6 కోట్ల విలువైన ఆభరణాలు మాయమైనట్టు శ్రీ కృష్ణ జ్యువెలర్స్ యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రోజూ లాగానే షాపు తెరిచిన యజమాని వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చి ఆభరణాలు చెక్ చేసుకోగా 6 కోట్ల అభరణాలు చోరీ అయినట్లు గమనించాడు. దీంతో మేనేజర్ సుకేతుషాకు కాల్ చేశాడు. సుకేతుషా ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. యజమానికి సుకేతుషాపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించగా షాపులో కనిపించని ఆ ఆభరాణాల వివరాలను యజమానిని అడిగి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.
అయితే షాపులో నగలు కనిపించకుండా పోయిన తర్వాత నుంచి సుకేతు షా కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉందని మేనేజర్‌పైనే యజమాని అనుమానం వ్యక్తం చేశారు. సుకేతుషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుకేతుషాకు షాప్‌లో వున్న వారే సహకరించారని అనుమానిస్తున్నారు. సుకేతు షా ఒక్కడే.. 6 కోట్ల నగలు మాయం చేసేంత సీన్ లేదన్నట్టు పోలీసులకు తెలిపారు. షాపులోనే పనిచేస్తున్న వారు అతనికి సహకరించి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు షాపులో పనిచేసే వాళ్లను విచారిస్తున్నారు. మేనేజర్ సుకేతు షా ఎక్కడికి వెళ్లాడు..? ఎప్పటి నుంచి షాప్‌లో పనిచేస్తున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త కనిపించడం లేదంటూ మేనేజర్ సుకేతు షా భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. వేధిస్తున్నారని లెటర్, ఒక వీడియో ఉందని ఫిర్యాదులో భార్య పేర్కొంది. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.