కోమన్‌పల్లిలో వీరజవాన్ మహేష్ అంత్యక్రియలు ముగిసాయి. సైనిక లాంఛనాలతో మహేష్ అంత్యక్రియలను నిర్వహించారు అధికారులు. గౌరవసూచకంగా సైనికులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందిన మహేష్ భార్య సుహాసినికి సైనిక దుస్తులు అందజేసింది ఆర్మీ.
మహేష్ కుటుంబసభ‌్యులు, బంధువులు, స్నేహితుల ఆశ్రునయనాలతో గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర కొనసాగింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మహేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిజామాబాద్ సీపీ కార్తికేయ పర్యవేక్షణలో అదనపు డీసీపీ, ఏసీపీ, ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, 150 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.