వాళ్లిద్దరిది మూడు దశాబ్దాల గురుశిష్యుల బంధం. గురువు కోసం సీటును త్యాగం చేసిన చరిత్ర శిష్యునిది. ఆ శిష్యుడు గురువు కోసం ఎంతవరకైనా తెగిస్తారు అయితే ఆ ఇద్దరి మధ్య చెడిందట. పాలునీళ్లలా ఉండే ఆ లీడర్లిప్పుడు, ఉన్నపళ్లంగా బద్దశత్రులయ్యారట. చాలారోజుల తర్వాత పచ్చని చెట్ల సాక్షిగా, మళ్లీ పాత స్నేహం కొత్తగా చిగురించిందట. దీంతో ఆ ఇద్దరి స్నేహ గీతికకు గ్రీన్ సీగ్నల్ అంటున్నారు. ఉప్పునిప్పులా ఉండే ఆ మంత్రి, ఎమ్మెల్యే మళ్లీ ఒక్కటై జిల్లాలో పాత రోజులను కోరుకుంటున్నారా...?
ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ అటవీశాఖ మంత్రి. కోనేరు కోనప్ప సిర్పూర్ టి ఎమ్మెల్యే. ఇద్దరిదీ దోస్త్ మేరా దోస్త్ బంధం. అంతకుమించి గురుశిష్యుల అనుబంధం. కానీ మొన్నటి వరకు ఇద్దరి మధ్య మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ దబిడి దిబిడే. అయితే, హరితహారం సాక్షిగా ఇద్దరి మధ్య కొత్త బంధం అంటుకట్టిందట. అదీ లేటెస్ట్ ట్రెండింగ్ స్టోరి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ టి ఎమ్మెల్యే కోనప్ప, దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే అనేలా కలిసిమెలిసి ఉండేవారు. ఈ ఇద్దరు నాయకులు గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. అప్పట్లో సిర్పూర్ టి నియోజకవర్గంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా బైపోల్స్‌లో గురువు ఇంద్రకరణ్ రెడ్డి కోసం కోనప్ప ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు. దాంతో కోనప్ప పోటీ చేయాల్సిన ఉప ఎన్నికలో, శిష్యుని త్యాగంతో ఇంద్రకరణ్ రెడ్డి సిర్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సమీకరణలు సరిపోక పరాజయం పాలయ్యారు. ఇక, 2014 ఎన్నికల్లో, కాంగ్రెస్ టిక్కెట్ ఇద్దరికీ దక్కలేదు. దాంతో గురువు ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి, కోనప్ప సిర్పూర్ టి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేసి, గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, టీఆర్ఎసలో చేరారు ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప. తర్వాత సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో ఇంద్రకరణ్ రెడ్డికి చోటు లభించింది. ఇలా ఇద్దరు నాయకులు ఒకే మాటగా, ఒకే బాటగా సాగారు. కానీ కాలం వారి స్నేహానికి పరీక్ష పెట్టింది.
గతేడాది జూన్ 30న కాగజ్‌నగర్ మండలం సర్పాల గ్రామంలో పోడుభూముల వివాదం, గురుశిష్యుల మధ్య అగాధం సృష్టించింది. అటవీ అధికారులకు, గ్రామస్తులకు మధ్య వివాదం రాజుకుంది. పోడుభూములను స్వాదీనం చేసుకోవడానికి వెళ్లిన అటవీ అధికారులపై ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు, కుమ్రంబీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ క్రిష్ణ, అతని అనుచరులతో కలిసి దాడిచేశారు. కర్రల యుద్దంలో మహిళా అధికారి అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడి చేసిన ఎమ్మెల్యే తమ్ముడు కోనేరు క్రిష్ణ, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ అరెస్టే, ఇంద్ర, కోనప్ప నడుమ చిచ్చు రగిల్చింది.
ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ అరెస్టుతో, గురుశిష్యుల నడుమ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి వల్లనే కోనేరు క్రిష్ణ, అతని అనుచరులు అరెస్టు అయ్యారని, రగిలిపోయారట కోనప్ప. దశాబ్దాలుగా అనుబంధం ఉన్నా, పోడు భూముల విషయంలో మంత్రి ఎలాంటి సహాయమూ అందించలేదని, అందవల్లనే, తమ్ముడు జైలు పాలయ్యారని కోనప్ప ఆగ్రహమట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది.
ఆ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప మద్య విభేదాలు భగ్గుమనే స్థాయికి చేరాయి. మంత్రి ఇంద్రకరణ్ కుమ్రంబీమ్ జిల్లా జడ్పీ సర్వసమావేశంలో పాల్గొంటే, కోనప్ప, ఆ నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపిపిలు ఏకంగా సమావేశాన్ని బహిష్కరించారు. నియోజకవర్గంలో సర్కారు పథకాలతో, కార్యక్రమాలు ఏవి నిర్వహించినా, జిల్లా మంత్రిగా కనీసం ప్లెక్సీలో ఇంద్రకరణ్ రెడ్డి ఫోటో పెట్టలేదట. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, పార్టీ పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ ఏడాది కాలంగా ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు తప్ప, ఏకం కాలేదు. కానీ హరితహారం సాక్షిగా, నేడు ఆ అనుబంధాన్ని అంటుకట్టుకునే ప్రయత్నం చేశారట.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ స్టన్నయ్యేలా, ఈ కార్యక్రమానికి, ఎమ్మెల్యే కోనప్ప అటెండయ్యారు. ఒక్కసారిగా అందరూ నోరెళ్లబెట్టారట. ఉప్పూనిప్పులా చిటపటలాడిన నేతలు, ఒక్క చోటకు చేరడమేంటని ఆశ్చర్యపోయారట. సొంత నియోజకవర్గంలో మంత్రికి ప్లెక్సీలో చోటివ్వని ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కార్యక్రమంలో పాల్గొనడం, స్థానికులు, అధికారులకు వింతగా మారింది. అంతేకాదు, ఆ సంభ్రమాశ్చర్యాలను మరింతగా పెంచుతూ, చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చిరునవ్వులు చిందిస్తూ, పలకరించుకున్నారు. మొన్నటి వరకు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతల చిద్విలాసంపై, స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది.
హరితహారం సాక్షిగా గురుశిష్యుల మధ్య బంధం మళ్లీ బలపడుతోందని కార్యకర్తలు సంబరపడుతున్నారట. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే కోనప్ప, వైఖరి మారడంపై అనుమాలూ వ్యక్తం అవుతున్నాయట. కాగజ్‌నగర్‌లో అన్నదానం స్థలం విషయంలో ఎదురుదెబ్బ తగిలిందట కోనప్పకు. కలిసి పనిచేయాలని కోనప్పపై పార్టీ పెద్దల ఒత్తిడీ ఉందట. అందుకే మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి ఇష్టంగానో, అయిష్టంగానో హాజరయ్యారని జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా గురుశిష్యులు మళ్లీ ఒక్కటి కావడంతో, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయిందట. గురుశిష్యుల మధ్య బంధం హరితహారంలా అల్లుకుపోతుందా లేదా వాడిపోయే చెట్డులా మారుతుందో చూడాలి.