Corona:18ఏళ్లు పైబడినవారికి ఇప్పట్లో వ్యాక్సినేషన్ సాధ్యమేనా?

Corona:18 ఏళ్లు నిండినవారు సెప్టెంబర్ వరకూ ఆగాల్సిందేనని తేల్చేసిన ఏపీ సీఎం

Update: 2021-04-30 12:35 GMT

కరోనా వ్యాక్సినేషన్

Corona: కరోనా కట్టడికి టీకానే పరిష్కారం అని తేలిపోయింది. మహమ్మారిని తరిమేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అర్థమైంది. మరి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఆ టీకా ఎంతవరకూ అందుబాటులో ఉంది..? మే 1నుంచి భారీ వ్యాక్సినేషన్ అని ప్రధాని చేసిన ప్రకటన వర్క్‌ఔట్ అవుతుందా..? ప్రభుత్వాలు ఊదరగొట్టినంత ఈజీగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవా..? ఓ వైపు ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికే రెండో డోస్ అందుతుందో లేదో తెలీని పరిస్థితి. ఇలాంటి తరుణంలో 18 ప్లస్ వారికి వ్యాక్సినేషన్ ఎంతవరకూ సాధ్యం..? అసలు రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటి?

ప్రతిరోజూ లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.. ఎటు చూసినా అస్తవ్యస్తంగా మారిన జనజీవనం.. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు. ఇలాంటి సమయంలో ప్రధాని ప్రకటన సంతోషం కలిగించేదే అయినా.. ఎంతవరకూ సాధ్యం అన్నదే ప్రశ్న. ముఖ్యంగా రేపటి నుంచీ ప్రారంభం కావాల్సిన వ్యాక్సినేషన్‌కు టీకాలు అందుబాటులో లేక చాలా రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఇప్పట్లో 18ప్లస్ వారికి వ్యాక్సిన్ సాధ్యం కాదు అన్న వాదనలే వినిపిస్తున్నాయి.

నిజానికి దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ ప్రజల్లో ఎన్నో అనుమానాలు. దీంతో మొదట్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాని పరిస్థితి. అయితే.. తాజాగా కరోనా ఓ రేంజ్‌లో విరుచుకుపడడం, వ్యాక్సిన్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలడంతో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ తీయారీ దారులతో కానీ, రాష్ట్రాలతో కానీ పూర్తిస్థాయిలో చర్చించకుండానే ప్రధాని మోడీ మే1 నుంచీ 18ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ అని ప్రకటించారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రధాని ప్రకట ఒకలా ఉంటే.. రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికే రెండో డోస్ కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రేపటి నుంచీ 18ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఎలా సాధ్యం అన్నదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. అటు.. తొలి దశ వ్యాక్సినేషన్‌లో సిబ్బంది అవగాహనా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలిసిన వారికోసం, వీవీఐపీల కోసం ఎక్కడికట్టడ వ్యాక్సిన్లను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వినిపించాయి. వ్యాక్సినేషన్ సిబ్బంది తెలిస్తే చాలు టీకా ఫ్రీ అన్న చందంగా తొలి దశ వ్యాక్సినేషన్ సాగిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు వ్యాక్సిన్ల హబ్‌గా హైదరాబాద్‌ను చెబుతుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా వ్యాక్సిన్ల తయారీ, సప్లయ్ కెపాసిటీ ఒక్క భాగ్యనగరానికే ఉందంటారు. కానీ ఇలాంటి కష్ట కాలంలో టీకా మాత్రం శూన్యం. కంపెనీల మధ్య పోటీ, విపరీతమైన డిమాండ్‌తో బల్క్‌లో టీకాలు ఉత్పత్తి చేయలేక కంపెనీలు చతికిలబడుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రధాని మోడీ అసలు ఏ ధైర్యంతో రేపటి నుంచి భారీ వ్యాక్సినేషన్ ప్రకటించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ కంపెనీలతో మోడీ చర్చలు ఫలించలేదా..? లేక ప్రధానిని కంపెనీలు తప్పుదోవ పట్టించాయా? టీకా అవైలబిలిటీకి డెడ్‌లైన్ అందరినీ అడిగి, క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించి ప్రకటించింది కాదా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఇప్పటే కరోనా కట్టడిలో కేంద్రం తీరు నవ్వుల పాలవుతోంది. దీంతో ఇప్పటికైనా వ్యాక్సిన్ కొరత లేకుండా అందరికీ ఎప్పటికి వ్యాక్సిన్ సప్లై అవుతుందో చెప్పగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News