బీజేపీ బండిలో ABVP అలజడి నిజమేనా?

Update: 2020-10-05 11:00 GMT

తెలంగాణ బీజేపీలో ఏబీవీపీ లొల్లి ముదురుతోందా? అదేపనిగా పరిషత్‌ నేతలకు పదవులు ఇవ్వడం, గొడవకు కారణమవుతోందా? బండి సంజయ్‌ పగ్గాలు చేపట్టాక, పిలిచి మరీ వారికే కీలక పోస్టులు ఇవ్వడమేంటని, సీనియర్లు రగిలిపోతున్నారా? అసలు బీజేపీ వెనక ఎన్నో కాషాయ సంఘాలున్నా, తెలంగాణ కమలంలో ఏబీవీపీ డామినేషన్ ఎందుకు పెరిగింది? వీటి పర్యావసనాలపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?

బీజేపీ. భారతీయ జనతా పార్టీ. ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్. రెండింటి అవినాభావ సంబంధం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. విద్యార్థి దశలో ఏబీవీపీలో చెలరేగిన యువ నాయకుల్లో చాలామంది, తర్వాతి దశగా బీజేపీలోకి వస్తారు. అటు ఆరెస్సెస్‌ నుంచి కూడా లీడర్లు పుట్టుకొస్తుంటారు. అయితే, భారతీయ జనతా పార్టీలో ఆరెస్సెస్ నుంచి వచ్చినవారే ఎక్కువ. ఏబీవీపీ బ్యాగ్రౌండ్ తక్కువ. ఎందుకంటే, బీజేపీలో సీనియర్లు చాలామంది ఏబీవీపీ నేతలను ఎంకరేజ్ చెయ్యరు. పెద్దగా పట్టించుకోరట. అయితే, తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత, పార్టీలో ఏబీవీపీ వాసన ఎక్కువైందట. వారికే ప్రాధాన్యత పెరిగిందట. ఏబీవీపీ లీడర్ అంటే చాలు, వెల్‌కమ్‌ అంటున్నారట. అదే ఇప్పుడు కాషాయ పార్టీలో కొత్త లొల్లికి కొబ్బరికాయ కొట్టిందట.

విద్యార్థి పరిషత్‌లో పనిచేసి వస్తే చాలు, హాట్‌లైన్‌లో పార్టీలో పదవులు వచ్చేస్తున్నాయట. ప్రస్తుతం ఉన్న కొత్త కమిటిలో అత్యధికులు వాళ్లేనట. వారే మొత్తం పార్టీలో డామినేషన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మిగతా నేతలు రగిలిపోతున్నారట. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో, అప్పుడే ఏబీవీపీకి రెడ్‌ కార్పెట్‌ పడింది. ఎందుకంటే, సంజయ్‌ కూడా ఏబీవీపీ నాయకుడే. విద్యార్థి నేతగా అప్పట్లో ఒక ఊపు ఊపారట. తాను అధ్యక్షుడయ్యాక, ఏబీవీపీ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట సంజయ్. కమిటీ ప్రధాన కార్యదర్శుల్లో ప్రేమెందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ ఏబీవీపీలో కీలకంగా పనిచేసిన వాళ్ళే. వీరితో పాటు పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మంత్రిజీ పూర్తిగా అక్కడ నుంచే ప్రస్థానం ప్రారంభించారు. ఇక ఉపాధ్యక్షుల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, మనోహర్ రెడ్డిది కూడా ఏబీవీపీ బ్యాగ్రౌండే. వీరితో పాటు ఎనిమిది మంది కార్యదర్శుల్లో ప్రకాష్ రెడ్డి కూడా పరిషత్ లో పనిచేసి పార్టీలోకి వచ్చారట. యువమోర్చా అధ్యక్షుడు భాను ప్రకాష్, మైనార్టీ మోర్చా అఫ్సర్ పాషా, ఎస్సీ మోర్చా కొప్పు బాషాలు కూడా ఏబీవీపీ నుంచి వచ్చినవారేనట.

ఇక త్వరలో జరుగబోయే రెండు పట్టభద్రుల ఎన్నికల కోసం కూడా, ఈ విద్యార్థి పరిషత్‌లో పనిచేసినవాళ్లే ఎక్కువగా టిక్కెట్ డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికే మహబూబ్ నగర్ , హైదరాబాద్, రంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ మరోసారి అక్కడ నుంచే పోటిచేస్తున్నారు. ఆయన ఏబీవీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నేతే. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి, పార్టీ జాతీయ కార్యవర్గం సభ్యుడు పేరాల శేఖర్ జీ, టిక్కెట్టు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రస్థానం ఏబీవీపీ నుంచే ప్రారంభమైంది. ఇక పరిషత్‌లో కీలకంగా పని చేసిన ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో నేత కాసం వెంకటేష్ సైతం ఏబీవీపీలో కీలకంగా పనిచేసిన లీడరే. వీళ్లంతా కూడా ఏబీవీపీ కార్డుతో, పట్టభద్రుల స్థానం కోసం తెగ ట్రయల్స్ వేస్తున్నారట.

బీజేపీలో ఏబీవీపీ వారికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం కొంతమంది నేతలకు ఏమాత్రం నచ్చడం లేదట. అధ్యక్షుడిది ఏ బ్యాగ్రౌండ్ అయితే, అదే సంస్థవారికే పదవులు కట్టబెట్టడమేంటని ఫైరవుతున్నారట. ఆరెస్సెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచీ తాము వచ్చామని, అలాగే కొందరు బీజేపీతోనే పొలిటికల్ కెరీర్ ప్రారంభించారని, మరి అలాంటి వాళ్లకు ఇంపార్టెన్స్‌ ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారట. బ్యాగ్రౌండ్ ఒక్కటే కాదు, పార్టీ కోసం ఎలా పని చేస్తున్నారు, ఎంతటి అంకితభావం వుందో వంటి అంశాలను బేరీజు వేసుకుని, పదవులు ఇస్తే, ఎవ్వరిలోనూ అభద్రతాభావం వుండదని చెబుతున్నారట. అయితే, యువకులకూ చాన్స్ ఇచ్చినప్పుడు, పార్టీ పరుగులు పెడుతుందని చెబుతున్నారట రాష్ట్ర నాయకులు. చూడాలి, రాష్ట్ర బీజేపీలో ఏబీవీపీ లొల్లి మరింత పెరుగుతుందో చప్పున చల్లారుతుందో.

Tags:    

Similar News