Suryapet: గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Suryapet: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Suryapet: తెలంగాణ గురుకులాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల అనుమానాస్పద మరణాలు వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నాయి. భువనగిరిలో ఇద్దరు విద్యార్థుల మృతి ఘటన మరవకముందే.. తాజాగా సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పదంగా మృతిచెందింది. అయితే శనివారం ఆ పాఠశాలలో ఫేర్‌వెల్ డే నిర్వహించారు. అప్పటివరకు సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆ విద్యార్థిని.. అనంతరం హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా పడి ఉంది.
తమ స్నేహితురాలు ఇంకా రావడంలేదని వెతుక్కుంటూ వెళ్లిన విద్యార్థినులు... వైష్ణవిని అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసి ప్రిన్సిపాల్‌కు చెప్పారు. వైష్ణవిని వెంటనే సమీపంలోని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.
అయితే తమ కూతురు మృతిపై అనుమానం ఉందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమ కూతురు ఇంటికి వచ్చిందన్నారు. అదే సమయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తమ ఇంటికి వచ్చారని.. తమ కూతురు చదువులపై ఆరా తీసినట్లు పేరెంట్స్ చెప్పారు. అయితే హాస్టల్‌లో ఫుడ్ బాగుండడం లేదని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో తమ కూతురు చెప్పిందన్నారు. ఈ విషయంపై మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో ప్రిన్సిపాల్ ఫోన్‌లో మాట్లాడినట్లు మృతురాలి తల్లి తెలిపారు.
ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ కూతురిని వేధించారని.. ఆ మనస్తాపంతోనే తమ కూతురు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు వైష్ణవి మృతదేహంపై గాయాలున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే గురుకుల ప్రిన్సిపాల్ మాత్రం స్టూడెంట్ సూసైడ్ చేసుకుందని అంటున్నారు.