నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు

Independent India Diamond Festival Closing Ceremony: వేడుకలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

Update: 2022-08-22 04:14 GMT

నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు

Independent India Diamond Festival Closing Ceremony: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను తెలంగాణలో 15రోజుల పాటు ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్ట్ 8 నుంచి మొదలైన కార్యక్రమాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ముగింపు వేడుకలను సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు కార్యక్రమాలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశభక్తితో కూడిన పలు సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ వజ్రోత్సవ వేడులకు దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా మూడు గంటలపాటు అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. సంగీతంలో జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాలు సాధించిన క్రీడాకారులను సీఎం కేసీఆర్ సన్మానిస్తారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించారు. 30వేల మంది ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో సహా పెద్ద సంఖ్యలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాకారులు హాజరవుతున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పాసులు కేటాయించడంతో పాటు ఎల్బీ స్టేడియం లోపలికి ఆయా కేటగిరిల వారిగా అనుమతించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిర్వహించిన 15రోజుల ఈ వజ్రోత్సవ వేడుకలకు సంబంధించిన లఘు వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం లేజర్ షో తో పాటు భారీ ఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.

Tags:    

Similar News