Coronavirus: హైదరాబాద్‌లో కోరలు చాస్తోన్న కరోనా
Coronavirus: గాంధీ హాస్పిటల్‌కు పెరుగుతున్న బాధితులు * గాంధీకి రోజుకు 30 నుంచి 40 కొత్త కేసులు
Coronavirus: హైదరాబాద్‌లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రెండో వేవ్ తర్వాత తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒకటి రెండు కేసులొచ్చే కాలనీల్లో ఇప్పుడు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి.
కోవిడ్ తగ్గుముఖం పట్టిందనే నిర్లక్ష్యం కోవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వంతో నగరంలో కోవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. భౌతిక దూరాలు పాటించడం..మాస్కులు పెట్టుకోవడం మానేశారు. శుభకార్యాలకు పరిమితికి మించి హాజరవుతున్నారు. ఇలా ప్రజల్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏ మాత్రం అలసత్వం వద్దంటూ అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీంతో క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటోన్న వైద్యులు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే థర్డ్‌వేవ్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
గాంధీ హాస్పిటల్‌లో పది రోజుల క్రితం రోజుకు పది కరోనా కేసులు వచ్చేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30 నుంచి 40కి చేరింది. మంగళవారం 46 మంది, బుధవారం 32 మంది బాధితులు చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 361 మంది రోగులు ఉన్నారు. రోజుకు 30 మంది డిశ్ఛార్జి అవుతుంటే మళ్లీ అదే సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. టిమ్స్‌లో 50 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు పెరుగుతున్నారు.
ఇక రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో మళ్లీ బెడ్లు పెంచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ వైద్యశాఖ. ప్రస్తుతం గాంధీ, టిమ్స్‌లలో మాత్రమే కరోనా చికిత్స అందిస్తుండగా,..కింగ్‌కోఠి, ఫీవర్, సరోజినీదేవీ ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలు కొనసాగుతున్నాయి. అవసరమైతే ఇక్కడ కూడా కరోనా రోగుల కోసం పడకలను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక మూడో దశలో పిల్లలకు సోకితే చికిత్స అందించడానికి నిలోఫర్‌లో వెయ్యి పడకలను సిద్ధం చేశారు.