మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంపు
Srinivas Goud Security: 10 నుంచి 20 మందికి పెరిగిన భద్రత సిబ్బంది
Srinivas Goud Security: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేయాలనే కుట్ర బయటకు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రతను పెంచారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఒక పైలట్ వాహనంతో పాటు 10 మందితో భద్రతను కల్పిస్తున్నారు. హత్య చేయాలనే కుట్ర బయటకు రావడంతో భద్రతను పెంచింది పోలీస్ శాఖ. రెండు పైలెట్ వాహనాలతో పాటు 20 మంది సెక్యూరిటీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు కీలక మలుపులు తిరుగనుంది. ఢిల్లీలో జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపారు. రెండు రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. కేసు విచారణ కోసం హైదరాబాద్ రావాలని పోలీసులు తెలిపారు. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసును న్యాయ విచారణ లేదా సీబీఐతో దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఇక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల కస్టడీ పిటీషన్‌ను నేడు మేడ్చల్ కోర్టు విచారించనుంది. మొత్తం 8 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కోర్టును కోరారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాకు బెయిల్ మంజూరు చేసింది మేడ్చల్ కోర్టు. మరోవైపు మిగిలిన నిందితులు సైతం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై మేడ్చల్ కోర్టులో విచారణ జరగనుంది.