తెలంగాణకు రెడ్ అలర్ట్.. మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్
Red Alert for Telangana: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Red Alert for Telangana: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ అంతటా మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయు సమ్మేళనం, ఉపరితల ఆవర్తనం కారణంగానే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక, రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున మరింత విస్తారంగా వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది.
కొద్దిరోజులుగా కురుస్తోన్న వర్షాలతో తెలంగాణ అంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. అలాగే, ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.
ఇక, హైదరాబాద్‌ను కూడా వాన వదలట్లేదు. భాగ్యనగరాన్ని ముసురు కమ్మేయడంతో కొద్దిరోజులుగా జోరువాన కురుస్తోంది. దాంతో, నగరంలో జనజీవనం దాదాపు స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, కూడళ్లలో పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. దాంతో, ఇళ్లల్లోకి నీళ్లుచేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, చల్లటి గాలులతో నగర జనం వణికిపోతున్నారు.
తెలంగాణలో కురుస్తోన్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. వాగులు పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు జిల్లాల్లో ప్రమాదకరస్థాయిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం జాగ్రత్త చర్యలు చేపడుతోంది.