Illegal Constructions In Nizamabad Corporation : నిజామాబాద్ కార్పొరేషన్ లో అక్రమ కట్టడాలు
అక్రమ ఇళ్ల నిర్మాణాలకు కేరాఫ్ మారింది ఆ నగర పాలక సంస్ధ. టౌన్ ప్లానింగ్ పర్యావేక్షణ లోపం ప్రజాప్రతినిధుల వసూళ్ల పర్వంతో కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. ఇళ్ల నిర్మాణాల్లోను నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారీతిన వ్యవహారిస్తున్నా పట్టించుకునే నాథులు కరువయ్యారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాకపోవడంతో పాత మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ నగర పాలక సంస్ధలో 60 డివిజన్లు ఉండగా వందల సంఖ్యలో కొత్త ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి పదుల సంఖ్యలో ఉంటే అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో భవన నిర్మణాలు జరుగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో కొంత మేర నిర్మాణాలు తగ్గినా తర్వాత భవన నిర్మాణాలు పెరిగాయి. మధ్యలో వదిలివేసిన భవన నిర్మాణాలను యజమానులు కొనసాగిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లతో పాటు ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. శివారులో కొత్త కాలనీల్లోను భవన నిర్మాణాలు చేస్తున్నారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిప్పుకుని ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసుకుని కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు- టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కలపడం విమర్శలకు తావిస్తోంది.
కమర్షియల్ ప్రాంతాలుగా పెరున్నా ఖలీల్‌వాడి, సరస్వతినగర్, ద్వారకానగర్, ఎల్లమ్మగుట్ట, ప్రగతినగర్, కంఠేశ్వర్, సుభాష్‌నగర్, గాంధీచౌక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. గజం ధర 50 వేల నుంచి లక్ష కు పైగా ఉంది. ఎక్కువ మొత్తంలో ధరలు ఉండడం వల్ల కొనుగోలు చేసిన వారు ఉన్న భూమిలో ఈ నిర్మాణాలు చేస్తున్నారు. ఆసుపత్రులతో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా నగరంలో అపార్ట్‌మెంట్‌లు, ఇతర నిర్మాణాలు అధికంగా వెలుస్తున్నాయి. నిబంధలు పాటించకుండా తమకున్న పలుకుబడి ద్వారా పైరవీలు చేసుకుంటూ రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి నిర్మాణాలు చేస్తున్నారు.
ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పాత భవనాలతో పాటు కొత్త భవనాలు వెలసినా రోడ్లు వెడల్పు కాకపోవడం వల్ల నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లలో కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధాన వ్యాపార కూడళ్ల దగ్గర పార్కింగ్ సౌకర్యం కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడైనా నిర్మాణాలను తనిఖీ చేసేందుకు అధి కారులు వెళితే రాజకీయ ఒత్తిళ్లు రావడంతో వెనకకు వేస్తున్నారు. అక్రమ కట్టడాలపై అధికారులు నోరు మెదపడం లేదు. అధికారుల నిర్లక్ష్యంవల్లే విచ్చల విడిగా భవనాలు నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరుగుతున్నాయని నగర వాసులు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ కు ఆదాయం పెంచుకునే మార్గం ఉన్నా అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. అమ్యామ్యాలకు అలవాట పడి అక్రమ నిర్మాణాలను చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులుజోక్యం చేసుకుని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.