Private Hospital Coronavirus Patient Bill: కరోనా రోగికి 17.5లక్షల బిల్లు
Private Hospital Coronavirus Patient Bill: హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా సోకిన బాధితులు చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే వారి నుంచి లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ జలగలు రక్తం పీల్చినట్టుగా పీలుస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఓ వృద్దుడు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ప్రయివేటు ఆస్పత్రి వేసిన ఫీజును చూసి గుండెపోటులో మరణించాడు. అంతే కాక కరోనా సోకిన ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరితే సాటి వైద్యులు అని కూడా చూడకుండా వారిపైన కూడా ఫీజులు భారం మోపుతున్నారు. ఇదేంటని ప్రయివేటు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిని బంధిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఇక ఇప్పుడు కొత్తగా కరోనా రోగికి 17. 5 లక్షల బిల్లు వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తి, అతని భార్య 10 రోజుల క్రితం సోమజిగూడా డెక్కన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. అయితే అక్కడ చేరిన బాధితులకు ఒక్క రోజు వైద్యానికి లక్షకి పైగా బిల్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 10 రోజుల పాటు వైద్యం అందుకున్న ఆ వ్యక్తికి 17.5 లక్షల బిల్లు వేశారు. కాగా ఆ బిల్లులో 8 లక్షలను బాధితుని కుటుంబ సభ్యులు కట్టారు.
ఇక ఈ క్రమంలోనే బాధితుని భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనాతో మృతి చెందింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం బాధితుని భార్య మృతదేహాన్ని మొత్తం బిల్లు కడితేనే ఇస్తామని చెప్పింది. అది విన్న బాధితుడు ఆవేదన తట్టుకోలేకి నిన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా ప్రస్తుతం ఆ ఆసుపత్రి యాజమాన్యం బాధితుల కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. ఇక ఇంతకముందు మూడు రోజుల క్రితం బాధితుని అన్న కొడుకు కూడా కరోనాతో మృతి చెందాడు.