చిన్నారిని చిదిమేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

* సోషల్‌ మీడియాలో ఈ ఘటనపై ఉప్పెనలా నిరసనలు * నిందితుడి ఆచూకీ కోసం 10లక్షల రిమాండ్‌ ప్రకటించిన పోలీసులు

Update: 2021-09-15 01:48 GMT

చిన్నారిని చిదిమేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారిని చిదిమేసిన నిందితుడి ఆచూకీ కోసం పోలీస్‌ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఏ చిన్న లొసుగును వదిలిపెట్టకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో నిరసనలు ఉధృతమయ్యాయి. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. ఇటు సినీ స్టార్లు సైతం ఈ ఘటనపై పెదవి విప్పారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి పోలీసులు 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

నిందితుడు రాజుకి తన స్నేహితుడు సహకరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పాపకు చాక్లెట్‌ ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లిన రాజు అత్యాచారం చేసి హతమార్చాడు. అనంతరం శవాన్ని గదిలో ఉంచి తాళం వేసి బయటకు వెళ్లాడు. చిన్నారి కోసం తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు గాలిస్తున్న సమయంలో రాజుని పారిపోవాలంటూ తన స్నేహితుడు సూచించినట్లు దర్యాప్తులో తేలింది.

రాజుని గుర్తుపట్టకుండా ఉండటానికి టోపీ, మాస్కు, టవల్‌, ఒక జత బట్టలతో ఒక సంచిని కూడా ఇచ్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానికుల ఆరోపణలకు బలం చేకూర్చుతూ సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. రాజుకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అయితే నిందితుడి ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. నిందితుడి వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో అతడు ఎటు వెళ్లింది గుర్తుపట్టడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు పోలీసులు నిందితుడి ఆచూకీ చెప్పాలంటూ రివార్డులు ప్రకటించారు. దీంతో నెటిజన్లు మంత్రిని విమర్శించడంతో సమాచార లోపం జరిగిదంటూ మంత్రి కేటీఆర్ రీ ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News