Section 163 in Hyderabad: హైదరాబాద్‌లో సెక్షన్ 163 అమలుపై కమిషనర్ క్లారిటీ

Update: 2024-10-28 15:47 GMT

Hyderabad police commissioner CV Anand: హైదరాబాద్‌లో నేటి నుండి నెల రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని చేసిన ప్రకటనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీపావళి పండగ సెలబ్రేషన్స్ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. దీంతో ఈ అంశంపై స్వయంగా హైదరాబాద్ పోలీసు బాస్ స్పందించారు. అవసరం వచ్చినప్పుడు సమయం, సందర్భాన్ని బట్టి పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధించడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ అని సీవీ ఆనంద్ అన్నారు. దేశవ్యాప్తంగా అంతటా ఇది మామూలుగా జరిగే తంతే అని గుర్తుచేశారు.

దీపావళి సెలబ్రేషన్స్ అనే వదంతులతో సంబంధం లేదు

దీపావళి వేడుకలకు, పోలీసుల ఆంక్షలకు ఎలాంటి సంబంధం లేదని సీవీ ఆనంద్ తెలిపారు. కొంతమంది నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తమకు నిఘావర్గాల ద్వారా సమాచారం అందింది. సీఎం నివాసం, సెక్రటేరియట్, డీజీపీ ఆఫీస్ వంటి ముఖ్యమైన భవనాలను ముట్టడించాలని కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ కమిషనర్ స్పష్టంచేశారు.

కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా ఇది కర్ఫ్యూ కాదని అన్నారు. ఆందోళనలతో ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బ తీయాలనుకునే వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు చేసే ప్రయత్నమే అని తెలిపారు. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 లోని సెక్షన్ 163 ప్రకారం (గతంలో ఐపీసీ సెక్షన్ 144) ప్రస్తుతం హైదరాబాద్ లో ఆందోళనలు, ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు అనుమతి లేదు. ఈ ఆంక్షలకు విరుద్ధంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒక్కచోట చేరి ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే వారిపై చట్టరీత్యా చర్య తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. అంతేకాదు.. బ్యానర్స్, ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం కూడా తప్పే అవుతుంది.

Tags:    

Similar News