వాన తగ్గినా.. వదలని వరద

వాన తగ్గింది. ఎండ వచ్చింది. అయినా వరద మాత్రం ఆగడం లేదు. రాత్రి కురిసిన వర్షానికి నాలాలు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు

Update: 2020-10-18 06:14 GMT

వాన తగ్గింది. ఎండ వచ్చింది. అయినా వరద మాత్రం ఆగడం లేదు. రాత్రి కురిసిన వర్షానికి నాలాలు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీస అవసరాలు కూడా లేక అవస్థలు పడుతున్నారు.. చిన్న పిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వాన నుంచి తెరుకోక ముందే మరోసారి కుండపోత వర్షంతో.. నగరంపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు.

ఉరుములు, మెరుపులతో శనివారం రాత్రి వర్షం హడలెత్తిచింది. క్యుములోనింబస్ మేఘాల తీవ్రతతో కురిసిన వర్షానికి హైదాబాద్ వణికిపోయింది. దాంతో చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. మొన్నటి వర్షానికి పేరుకుపోయిన బురద ఇంకా పోకముందే.. మళ్లీ భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. జనాల అవస్థలు పడుతున్నారు. అటు పాత బస్తీలోనూ భారీగా వర్షం కురువడంతో.. నాలాలు పొంగిపోర్లాయి. ఇటు జాతీయ రహదారులపై వరద ప్రతాపం చూపించింది. దాంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రాకపోకలు నిలిచిపోవడంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. నిండుకుండలా మారిపోయింది. ఎగువ నుంచి భారీగా తరలివస్తోన్న వరదనీటితో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. దాంతో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసిలోకి భారీగా వరద నీరు వస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు..

హైదరాబాద్‌లో వరదల కారణంగా ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ పోలీసులు, అధికారులు పిలుపునిచ్చారు. నగరంలో ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు రావడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. చంద్రాయాన్ గుట్ట, మలక్‌పేట, చాదర్ ఘాట్, కాచిగూడ రోడ్ల నుంచి ప్రజలు రావొద్దంటూ ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నారు.

Tags:    

Similar News