NIA notice : భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో ఎల్గర్ పరిషత్ కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 9 న ఏజెన్సీ ముందు హాజరు కావాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఇద్దరు అల్లుళ్లకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. ముంబైలోని ఎన్‌ఐఏ దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని ఇఫ్లూ ప్రొఫెసర్ కె సత్యనారాయణ, ఆయన తోడల్లుడు జర్నలిస్ట్ కెవి కుర్మనాథ్ ను నోటీసులు జారీ చేసారు. నోటీసులపై స్పందించిన కె. సత్యనారాయణ, సిఆర్‌పిసి సెక్షన్ 160, 91 కింద ఎన్‌ఐఏ తనను, తన తోడల్లుడిని సాక్షులుగా పిలవడం బాధగా ఉందని అన్నారు.
తన మామ వరవరావుపై పెట్టిన కేసులో సాక్ష్యాలు సేకరించేందుకు 2018 ఆగస్టులో తన ఇంటిపై పూణే పోలీసులు దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. "భీమ్ కోరెగావ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అప్పుడు చెప్పానని అన్నారు. వరవరరావు అల్లుడిననే కారణంతోనే పోలీసులు తన ఇంటిపై దాడి చేసి, మానసిక వేదనకు గురిచేసారని ఆయన అన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పోతే భీమా కోరేగావ్ కేసులో వరవరా రావును 2018 ఆగస్టులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నినందుకు అతన్ని అదే ఏడాది నవంబర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వరవరరావు 2018 నుంచి మహారాష్ట్ర జైలులో ఉన్నారు.