ఈనెల 2న టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటా పోటీ భేటీలు

TRS and BJP: జాతీయ రాజకీయాలతో హీటెక్కనున్న హైదరాబాద్‌

Update: 2022-07-01 03:35 GMT

ఈనెల 2న టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటా పోటీ భేటీలు

TRS and BJP: జాతీయ రాజకీయాలతో భాగ్యనగరం వేడెక్కనుంది. ఒక వైపు బీజేపీ, మరోవైపు టీఆర్‌ఎస్‌ హైదరాబాద్ కేంద్రంగా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 4న పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలోనూ మోడీ పాల్గొంటారు. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌ను జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా ఎంచుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేతలే స్పష్టం చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.

సరిగ్గా మోడీ హైదరాబాద్‌కు వస్తున్న రోజునే.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న యశ్వంత్‌ సిన్హాకు.. కేసీఆర్‌ స్వయంగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా జలవిహార్‌కు చేరుకోనున్నారు. జలవిహార్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్న యశ్వంత్‌.. తనకు ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు.

ఇదే వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు కేసీఆర్‌ సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దీటుగా.. యశ్వంత్‌ సమావేశమూ హైలెట్‌ అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీనే లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో పావులు కదపాలని చూస్తున్న కేసీఆర్‌.. తన ప్రత్యక్ష కార్యాచరణ ఈ సమావేశంతోనే ప్రారంభించనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలకు అప్పగించారంటేనే.. టీఆర్‌ఎస్‌ అధినేత ఎంత సీరియ్‌సగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యశ్వంత్‌సిన్హాతో భేటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ఇంటిపై వాలిన కాకి.. కాంగ్రెస్‌ ఇంటిపైన వాలే ప్రశ్నే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు వస్తున్న యశ్వంత్‌ సిన్హాను తాము కలవడం లేదని చెప్పారు. 

Tags:    

Similar News