హెచ్ సీయూలో మొదటి సారి.. విద్యార్థినికి రూ.43 లక్షల ప్యాకేజీ
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థిని వి. నందిని సోని జాక్ పాట్ కొట్టింది.
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థిని వి. నందిని సోని జాక్ పాట్ కొట్టింది. యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వూలో ఏకంగా రూ.43 లక్షల వార్షిక వేతనం లభించే ఉద్యోగానికి ఎంపికైంది. హెచ్‌సీయూలోని ప్లేస్‌మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో నిర్వహించిన ఈ ప్లేస్‌మెంట్ లో, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లోని ఎంసీఏ చదువుతున్న వి. నందిని సోని అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు.
ఎంతో మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేయగా వారిలో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్‌సీయూ ప్లేస్‌మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో చైర్మన్ రాజీవ్ వాంకర్ తెలిపారు. అందులో అందరికంటే ఎక్కువ ప్యాకేజీ గల ఉద్యోగం సోని నందిని సాధించిందని తెలిపారు. ఇప్పటి వరకూ హెచ్‌సీయూలో చరిత్రలోనే ఇంత ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ రికార్డు సాధించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ముందు ఇంజినీరింగ్ కోర్సు చేయాలనుకున్నానని చెబుతూ, అనంతరం నైపుణ్యం కలగిన సాఫ్ట్ వేర్ డెవలపర్ కావాలన్న లక్ష్యంతో ఎంసీఏ లో చేరినట్లు తెలిపారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో పూర్తి చేశారని, అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవీయర్స్ కళాశాలలో బీసీఏ చదివారని తెలిపారు. ఈ ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసారు.