హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ ప్రెస్ వేపై రెండు వేరు వేరు కారు ప్రమాదాలు కలకలం రేపాయి. ఆదివారం జరిగిన రెండు వేర్వేరు కారు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. శంషాబాద్ నుండి మెహిదీపట్నం పైపు వేగంగా వెళ్తున్న ఓ కారు పిల్లర్ నెంబర్-158 వద్ద అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న కరెంటు పోల్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
మరో సంఘటనలో, మెహదీపట్నం నుండి శంషాబాద్ వెళ్తున్న ఇన్నోవా కారు రోడ్ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఇదే విధంగా జూలై 10వ తేదీ, 2020న, మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళుతున్న కారు పిల్లర్ నంబర్ 170 వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.