BJP: దుబ్బాకలో దుమ్మురేపిన బీజేపీ
BJP: బల్దియాలో బంపర్ మార్కులు సాధించిన కమల దళం * హుజురాబాద్ ఉపఎన్నిక ఓ చాన్స్‌గా భావిస్తున్న బీజేపీ
BJP: కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఫలితం తేడా వస్తే తెలంగాణ మరో బెంగాల్ అవుతుందన్న ఆందోళన టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. అనవసరంగా బీజేపీకి చాన్సిచ్చామన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా టాక్. ముందు నుంచి ఈటల రాజేందర్ సొంత పార్టీ ఆలోచనలో ఉన్నారన్న రాష్ట్ర ఇంటలిజెన్స్ నివేదికలను కేసీఆర్ నమ్మారు. అయితే పార్టీ నుంచి బయటికి పోతే కనుక రేవంత్, కోదండరాం వంటి వారితో కలిసి ఆయన కొత్త పార్టీ ఆలోచన చేస్తారని అంచనా వేసారు. కానీ చివరికి ఈటల తనకు అలాంటి ఆలోచనలే లేవని నేరుగా బీజేపీలో చేరిపోయారు. ఇక బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆట మొదలైందనే సంకేతాన్ని ఇవ్వడంతో వార్ షురూ అయింది.
హుజురాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీనివ్వాలని బీజేపీ చర్యలు ముమ్మరం చేస్తోంది. బెంగాల్ తరహా పోరాటం చేసేందుకు కాషాయదశం కదం తొక్కుతోంది. అక్కడ మమతపై పోరాటం చేసి మూడూ సీట్ల నుంచి 70 సీట్లకు వెళ్లిన బీజేపీ తర్వాతి టార్గెట్ తెలంగాణేనని ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రకటించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం.. గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు బీజేపీకి బూస్ట్‌నిచ్చాయి. కాని ఆ తర్వాత జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. అయితే ఆ ఫలితాలు బీజేపీని తీవ్రంగా నిరాశ పరచడంతో తిరిగి పుంజుకునేందుకు హుజురాబాద్ ఉపఎన్నిక అందివచ్చిన అవకాశంగా కమలదళం భావిస్తోంది.
దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ నేతల దూకుడును చూసిన టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలో పడ్డారు. అందుకే అక్కడ బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో గెలిచే అవకాశం ఇవ్వకూడదని స్వయంగా వ్యూహాలు రచిస్తున్నారు. హుజూరాబాద్‌లో రెండు, మూడు బహిరంగ సభలు పెట్టె ఆలోచనలో ఉన్నారు. పరిస్థితిని బట్టి పార్టీ హోల్డ్ పెరిగే దాకా అభ్యర్దిని ప్రకటించొద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.