తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు

*టెన్త్ విద్యార్ధులకు మే 23 నుంచి పరీక్షలు

Update: 2022-05-03 01:30 GMT

తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. టెన్త్ విద్యార్ధులకు మాత్రం మే 23 నుంచి పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్ధులకు క్లాసులు నిర్వహణ కొనసాగుతుంది. ఇదే ఇప్పుడు విద్యార్ధులకు శాపంగా మారింది. పదో తరగతి విద్యార్ధులకు క్లాసులు జరుగుతున్నాయి కానీ కిచెన్‌కు తాళం పడింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

ఉదయం 8గంటల నుండి 2గంటల ప్రత్యేక తరగతులకు విద్యార్ధులు హాజరవుతున్నారు. ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయుడితోపాటు ఒక టీచర్‌ బడికి హాజరు అవుతున్నారు. ఈ నిబంధనలు పాటించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4వేల 600 సర్కారు బడులు, 194 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 2లక్షల 10వేల మంది పదోతరగతి విద్యార్థులు బడులకు వస్తున్నారు.

పల్లెల్లో కొద్ది శాతం మందే ఉదయం అల్పాహారం లేదా భోజనం తిని సర్కారు బడికి వస్తారు. అధిక శాతం మంది పాలు లేదా టీ తాగి తరగతులకు హాజరవుతుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారిలో 70 శాతం మంది ఏమీ తినకుండానే బడులకు వస్తున్నారని ఆరేళ్ల క్రితమే కేంద్ర విద్యాశాఖ క్షేత్రస్థాయి అధ్యయనంలో తేల్చింది. ఐనా ఇప్పటి విద్యార్ధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

పాఠశాల విద్యాశాఖ అధికారులు పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రత్యేక తరగతులు మొదలై రోజులు గడుస్తున్నాఇప్పటివరకు దానికి ఆమోదం రాలేదు. ఇప్పటికైనా తమ ఆకలి బాధలు అర్ధం చేసుకోవాలని టెన్త్ విద్యార్ధులు కోరుతున్నారు.

Tags:    

Similar News