Munugode by-poll: మునుగోడులో అల్లుళ్ల జోరు!

Munugode by-poll: బిడ్డా, అల్లుళ్ల సందడి ఉంటేనే.. పండగ పూట అత్తారిళ్లు కళకళలాడుతాయి.

Update: 2022-10-16 05:28 GMT

Munugode by-poll: మునుగోడులో అల్లుళ్ల జోరు!

Munugode by-poll: బిడ్డా, అల్లుళ్ల సందడి ఉంటేనే.. పండగ పూట అత్తారిళ్లు కళకళలాడుతాయి. దసరా అయినా, దీపావళి అయినా.. సంక్రాంతి అయినా.. అల్లుళ్లను హ్యాపీగా ఉంచితేనే.. సంతోషాలు రెట్టింపవుతాయి. బంధుత్వాలు బలపడతాయి. అదేంటి మొన్నేకదా.. దసరా పోయింది.. మళ్లీ ఏంటీ ఇప్పుడు అల్లుళ్ల గోల అని అనుకుంటున్నారా..? దీపావళి వస్తోంది కదా.. అల్లుళ్లకు స్పెషల్ ఏమైనా ఉండొచ్చని భావిస్తున్నారా..? దీపావళి, సంక్రాంతి కాదండి.. ఇప్పుడంతా ముందుంది మునుగోడు పండగ అన్నట్లుగా సాగుతోంది. ఈ ఉపఎన్నిక పండగ కూడా అల్లుళ్లదే హవా అవుతోంది. మునుగోడుతో బంధుత్వాన్ని కలిగిన అల్లుళ్ల జాబితాలో.. అన్నిపార్టీల నాయకులున్నారు. ఇప్పుడా అల్లుళ్ల పలుకుపబడికి ఈ ఎన్నికలే పరీక్షగా మారనున్నాయి. మరి అల్లుళ్ల లిస్టులో ఉన్న ఆ లీడర్లెవరో చూద్దాం..?

మునుగోడు సమరం మూడు ప్రధాన పార్టీలకు చావోరేవోగా మారింది. ఎలాగైనా గెలిచి తీరాల్సిన ఈ ఎన్నికల కోసం అవకాశం ఉన్న అన్ని దారులను కలుపుకుపోతున్నారు. అలా మూడు పార్టీలకు చెందిన నాయకులకు మునుగోడు అంటే కేవలం ఎన్నికే కాదు అంతకుమించి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు మునుగోడుతో బంధుత్వం కూడా ఉంది. తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి మునుగోడే అత్తారిల్లు. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన ఆడబిడ్డనే జగదీశ్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. అంతేకాదు తన భార్యకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాగా వారందరి అత్తాగారిళ్లు కూడా ఇదే నియోజకవర్గమే. అలాగే జగదీశ్‌రెడ్డికి వరుసకు సోదరుడయ్యే టీఆర్ఎస్ నాయకుడు భవనం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నియోజకవర్గంలో ఉంటారు. ఇలా మునుగోడులో జగదీశ్‌రెడ్డికి బంధుగణం భారీగానే ఉంది.

అలాగే టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మునుగోడుకు మధ్య దగ్గరి బంధుత్వమే ఉంది. తన భార్య అమ్మమ్మగారి సొంతూరు మునుగోడు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామం. తన అత్తగారి చెల్లెలిది కొంపల్లి గ్రామం. ఇలా భార్యవైపు బంధువులు ఎక్కువగా ఉండటంతో మునుగోడుకు రేవంత్‌కు మధ్య చాలాకాలం నుంచే రాకపోకలున్నాయి. అలాగే మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అత్తారిల్లు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఆయన భార్య జమున తల్లిగారు మునుగోడు మండలం పలివెల గ్రామం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే కొండవీటి గురునాధరెడ్డి సోదరుడు కొండవీటి సత్తిరెడ్డి కుమార్తెనే ఈటల రాజేందర్‌ వివాహమాడారు. ఇక వీరే కాకుండా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అత్తగారి ఊరు.. మనుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు కాగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి అత్తగారి ఊరు చండూరు మండలంలోని నర్మెట గ్రామం. అలాగే ఆయన సోదరి కుంభం నర్సమ్మది మర్రిగూడెం మండలం కొండూరు గ్రామం. ఇలా అన్ని పార్టీలకు చెందిన నాయకులకు మునుగోడుకు విడదీయరాని సంబంధం ఉంది.

అలా మునుగోడు ఇప్పుడు కేవలం ఎన్నికలతో ముగిసిపోయే అంశం కాదు. ఇది తమ పలుకుబడికే పరీక్ష. అత్తవారి ఊర్లో సత్తా చాటి మీసం మెలేసేందుకు ఆయా నేతలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఎలాగైనా గెలిచి ఇజ్జత్ కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. బంధువుల ఇళ్లలోనే మకాం వేసి ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి 2018 ఎన్నికల నాటి నుంచే మునుగోడుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజాగా ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో ఎలాగైనా ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన బంధుగణం ఎక్కువగా ఉన్న మునుగోడుతోపాటు పరిసర ప్రాంతాల ఎంపీటీసీ స్థానాల బాధ్యతలనూ పార్టీ అధిష్ఠానం ఈయనకే అప్పగించింది. జగదీశ్‌రెడ్డి ప్రస్తుతం తన అత్తగారి ఊరైన ఇప్పర్తిలోనే ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు.

అలాగే రేవంత్‌రెడ్డి కూడా తరచూ మునుగోడుకు వచ్చి వెళ్తూ ఉండేవారు. ప్రస్తుతం ఉప ఎన్నిక ప్రచారంతో గత కొన్ని రోజులుగా కొంపల్లిలోని తన అత్తవారి బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. ఇక్కడినుంచే ప్రతిరోజూ దాదాపు పది గ్రామ పంచాయతీల పరిధిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడి ప్రజలు కూడా రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కంటే కొంపల్లి అల్లుడిగానే సంభోదిస్తుండటం విశేషం. అలాగే ఒకప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో మునుగోడు అభివృద్ధిపై ప్రత్యేక నజర్ పెట్టిన ఈటల రాజేందర్‌ కూడా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు నుంచే మునుగోడుపై ఫోకస్ చేశారు. తన అత్తారింటి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలా మునుగోడుతో బంధుత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తూ తమ పార్టీ విజయం కోసం శ్రమిస్తున్నారు. 

Tags:    

Similar News