భారీ వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేశాయి. వరద కన్నిటి నుంచి తేరుకునేలోపే మరోసారి కురిసిన భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముంపు ప్రాంతాల్లో హెచ్ఎంటీవీ బృందం క్షేత్రస్ధాయిలో పర్యటించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంది. బస్తీలోని చిన్నారులను గుడిసెలలోంచి హెచ్ఎంటీవీ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నగరంలోని ప్రస్తుత పరిస్థితులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
నగరంలోని మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మనిషి మునిగిపోయే స్థాయిలో నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇళ్లలో నీరు చేరడంతో నిత్యావసరాలు తడిచిపోయి కనీసం తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
అటు కర్మాన్ ఘాట్ శివసాయి కాలనీ వాసుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని పేదవాళ్ల గుడెసెలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ఇంట్లో చిన్న పిల్లలకు కనీసం పాలు, ఆహారం ఇచ్చే పరిస్ధితి కూడా లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలో హెచ్ఎంటీవీ బృందం చిన్నారులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఇంతటి కష్టంలోనూ ఏ అధికారి తమ వద్దకు రాలేదని హెచ్ఎంటీవీ ముందుకొచ్చి సాయం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు పూర్తిగా జలమయమైన ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో బోటులో వెళ్లి మరీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది హెచ్ఎంటీవీ బృందం. అక్కడా అదే ఆవేదన అవే కన్నీళ్లు కనీసం త్రాగు నీరు కూడా అదించేందుకు ఒక్క అధికారీ తమ దగ్గరకు రాలేదని వాపోయారు. ఎంతోకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు అధిగమించలేకపోతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా భాగ్యనగరం ఎన్నో కన్నీళ్లకు, కష్టాలకు సాక్ష్యంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసిన హెచ్ఎంటీవీ బృందానికి అడుగడుగునా కన్నీటి సంద్రాలే దర్శనమిచ్చాయి. ఎవరిని కదిపినా సమయానికి సాయం అందించని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికైనా అధికారులు స్పంధించి సహాయక చర్యల్లో వేగం పెంచాలని వేడుకుంటున్నారు.