హైదరాబాద్‌లో ఉచితంగా మట్టి గణేశ్‌లు
HMDA Distribute Clay Ganapati Idols : హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
HMDA Distribute Clay Ganapati Idols : హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథార్టీ అధికారులు హైదరాబాద్‌లో ప్రజలకు మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమల్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ నెల 22న వినాయక చవితి ఉండడంతో మొత్తం 50 వేల మట్టి గణేశులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంచుతామని వివరించారు. ముఖ్యంగా మహానగరంలో వేల వినాయక మండపాలు ఉంటాయి. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుల విగ్రహాలను వాడతారు. దీంతో జలకాలుష్యం పెరిగిపోతుండడంతో దాన్ని వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏటా ఇలా ఫ్రీగా మట్టి విగ్రహాల్ని ఇస్తోంది.
అదే విధంగా ఈ ఏడాది కూడా ఈ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మట్టి గణపయ్యలను తెలంగాణ కుమ్మరి సంఘం నుంచి సేకరించనుంది. అందువల్ల కుమ్మరి సంఘం వారికి ఆదాయం లభించనుంది. అలాగే పర్యావరణానికీ మేలు జరగనుంది. ఇక ఈ మట్టివినాయకులను వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడానికి వారం ముందు నుంచి అంటే ఆగస్ట్ 16వ తేది అనంతరం నగరంలోని ఆయా ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి అదికారులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక ప్రతి ఏడాది నగర పరిధిలోని హుస్సేన్ సాగర్‌తోపాటూ మరో 169 చెరువుల్లో గణపతి నిమజ్జనం జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా జరగనుంది. మొత్తం 70 వేల ప్రతిమల్ని నిమజ్జనం చేయనున్నారు.
ఇక పోతే నగరంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి పర్యావరణహితంగా రూపుదిద్దుకోబోతున్నాడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా మట్టితో రూపుదిద్దికుంటున్న గణపయ్య అదే ప్రదేశంలో నిమజ్జనం కానున్నాడు. అందుకు సంబంధించిన అన్ని పనులను ఇప్పటికే ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టుగా విగ్రహాన్ని 9 అడుగులకే పరిమితం చేశామని కమిటీ తెలిపింది.