కొత్త రెవెన్యూ చట్టం ముఖ్యాంశాలు..

Update: 2020-09-09 07:58 GMT

ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. కొత్త చట్టం వివరాలను వెల్లడించారు. ఈ చట్ట ప్రకారం తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు. ప్రతి సర్వే నెంబర్‌కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తారని వెల్లడించారు. ఈ చట్టం వచ్చాక భూమి కోసం ఎవరూ గొడవ పడే ఘటనలు ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.

రెవెన్యూ బిల్లులోని పలు ముఖ్యాంశాలు

- ధరణి పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. పూర్తి పారదర్శకంగా ఉంటుంది

- పోర్టల్‌ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ లాండ్‌ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి

- ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు

- కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు

- కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవు

- రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యూటేషన్‌

- మ్యూటేషన్‌ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగిస్తం

- మ్యూటేషన్‌ అయిన వెంటనే ధరణిలో అప్‌లోడ్‌ కావాలి

- రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాస్‌బుక్‌, ధరణి కాపీ వెంటనే తీసుకోవచ్చు

- తెలంగాణ రాష్ట్ర భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉంటుంది.

- ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన

- పాస్‌ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసిల్దార్లదే

- వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తైన వెంటనే బదిలీ చేయాలి

- రికార్డు పూర్తిచేసి కొన్నవారికి బదిలీ చేయాలి

- తప్పుచేసిన తహసీల్దార్‌పై బర్తరఫ్‌ క్రిమినల్‌ చర్యలు, తిరిగి భూములు స్వాధీనం

- రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం అధికారులపై దావా చేయకూడదు

- డిజిటల్‌ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు

- రుణాల మంజూరుకు పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు

- వీఆర్‌వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ

- వీఆర్‌ఎస్‌ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం

- రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదు

- అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు

Tags:    

Similar News