Telangana: తెలంగాణ లో భగ్గుమంటోన్న సూర్యుడు
Telangana: మంగళవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
Telangana: రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలు రికార్డయింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అర్లి(బి), బేల, చేప్రాల, జైనథ్, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 41.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.7 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీలుగా రికార్డయింది.
గాలిలో తేమ ఆదిలాబాద్‌లో 10 శాతమే నమోదుకాగా.. రాష్ట్రంలో సగటు 42 శాతం నుంచి 88 శాతం వరకు నమోదైంది. అతి తక్కువగా సంగారెడ్డి జిల్లా అల్లోలెలో 20.6 డిగ్రీలు నమోదైంది. కాగా, తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడింది. సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వరకు ఇంటీరియర్ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరట్వాడా దాకా మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో నిన్న భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
ఈ నెల 9, 10 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.