Etela Rajendar: ఈటలకు హైకోర్టులో ఊరట
Etela Rajendar: జమున హ్యాచరీస్ వ్యవహారంలో మెదక్ కలెక్టర్ హరీశ్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు పేర్కొంది.
Etela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేంద్ర కు హైకోర్టులో ఊరట లభించింది. తన కుటుంబానిక చెందిన జమున హ్యాచరీస్ కోసం మాజీమంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది.
వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై న్యాయమూర్తి వినోద్ కుమార్ తన నివాసంలోనే విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసేముందు తమకు నోటీసు ఇవ్వలేదని తెలిపారు. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని కోర్టుకు తెలిపారు.కలెక్టర్ నివేదికను కూడా తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందుకే విచారణ చేపట్టామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు.
అయితే విచారణ జరిగిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా?అని ప్రశ్నించింది.రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందని అడిగింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని వ్యాఖ్యానించింది. ఈ నివేదిక అధికారులు కారులో కూర్చుని రూపొందించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.