Telangana: నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి.. హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించకపోతే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని సిటి స్కాన్, ఆక్సిజన్ బెడ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలపై జీవో జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సంబంధించి గతేడాది ఇచ్చిన జీవో ఇప్పటి అవసరాలకు పనికిరాదని హైకోర్టు తేల్చిచెప్పింది.
రెండు రోజుల్లో అడ్వైజరీ కమిటీ నియమించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులు 24 గంటల్లోనే ఇవ్వాలన్న ధర్మాసనం రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. ఏపీ నుంచి కొత్త స్ట్రెయిన్ వైరస్ వస్తున్న నేపథ్యంలో ఏపీ-టీఎస్ సరిహద్దు దగ్గర పటిష్ట చర్యలు చేపట్టాలని హెచ్చరించింది హైకోర్టు. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి. ఆస్పత్రుల వద్ద పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.