Hyderabad Police: సిటీ పోలీస్‌ సిబ్బందికి ఉన్నతాధికారులు కీలక సూచన

Hyderabad Police: సిబ్బంది ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మేలైన నిర్ణయం * రోజూ 10 వేల అడుగులు నడవాలని సూచన

Update: 2021-04-03 06:52 GMT

నగర్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: రన్నింగ్‌ పోటీలా మారిన జీవన శైలి ధాటికి మధ్య వయసులో వచ్చే వ్యాధులన్నీ యుక్తవయసులోనే దాడి చేస్తున్న నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు మేలైన నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కొన్ని కీలక సూచనలు చేశారు. ఒత్తిడితో కూడుకున్న విధి నిర్వహణ వల్ల వ్యాయామం ఉండటం లేదని గమనించి సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.

నగరంలో నేరాలను నివారించి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకమైంది. ఇందుకు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఉన్న సమయాన్ని విధులకే కేటాయిస్తున్నారు. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ 45 రోజుల క్రితం నగర పోలీసు అధికారులు తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు ఏదో ఒక సమయంలో నడక తప్పనిసరి చేసుకోవాలంటూ సూచనలు చేశారు.

ప్రతి పోలీస్‌ అధికారి రోజు తప్పనిసరిగా వాకింగ్‌ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. యువ అధికారులైతే 10 వేలకుపైగా అడుగులు, సీనియర్‌ అధికారులైతే 7 వేల అడుగులు ట్రేడ్ మిల్ పై వాకింగ్ ట్రాక్ పై వేయాలని సూచించింది. 45 రోజుల నుంచి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లలో అమలవుతున్న ఈ విధానాన్ని డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందరూ తమ మొబైల్స్‌లో వ్యాయామానికి సంబంధించిన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అందులో ప్రతి రోజు ఎన్ని అడుగులు నడిచారనే కచ్చితమైన లెక్కను చూసుకోవాలంటూ సూచించారు.

నడక దీర్ఘాయువుకు నిచ్చెన వేస్తుంది. చక్కటి ఆరోగ్యానికి బాటలు పరుస్తుంది. వ్యాయామాన్ని విధి నిర్వహణలో భాగంగా చేస్తే పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటారని తద్వారా వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయని హైదరాబాద్‌ పోలీస్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ఆకాంక్షించారు.

Tags:    

Similar News