ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు
Adilabad: పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రధాన ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి.
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలోని పలుచోట్ల వరద నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురికావల్సి వస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో వరదలతో పంటపొలాలు నీట మునిగిపోయాయి. వరద నీటి ప్రవాహానికి పంటలతో పాటు ప్రధాన రోడ్లపై నుండి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఆదిలాబాద్ నుండి కరీంనగర్ , మంచిర్యాల , ఆసిఫాబాద్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇచ్చోడ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కల్వర్టులు కొట్టుకుపోయాయి. మండలంలోని జల్డా గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వరద ధాటికి కల్వర్టు తెగిపోయింది. మహిళను తీసుకెళ్తున్న అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుంది. అయితే గ్రామస్తుల సహాయంతో గర్భిణిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.
అటు నిర్మల్ జిల్లాలో వరద వరద ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దాంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు అధికారులు. మరోవైపు గోదావరి నది ఉప్పొంగడంతో ఖానాపూర్ మండలంలోని చిట్యాల గ్రామ శివారులోని కుర్రు వద్ద పదకొండు మంది వ్యవసాయ కూలీలు వరదల్లో చిక్కుకుపోయారు. కడెం మండలంలోని ఇస్లాంపూర్ వద్ద వాగులో చిక్కుకున్న యువకున్ని గ్రామస్థులు రక్షించారు. జిల్లా కేంద్రంలోని జి ఎన్ ఆర్ కాలనీలో భారీగా వరద నీరు చేరడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాలుగోరోజు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీతో కలిసి కడెం, ఖానాపూర్ ,సారంగాపూర్ మండలాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కడెం, స్వర్ణ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు.