Warangal: వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Warangal: నీట మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు

Update: 2021-09-10 04:53 GMT
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Warangal: తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వంకలు ఉవ్విళ్లూరుతున్నాయి. చెరువులు నిండుకుండలా పొంగుతూ మత్తళ్లు పోస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడుతున్నట్టు కురుస్తున్న వర్షానికి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పంటలన్నీ నీటమునిగాయి. పత్తి చేన్లు నేల రాలిపోయాయి. వరద తాకిడికి వరి మొత్తం కొట్టుకుపోయింది. మొక్కజొన్న, పసుపు పంటలు నీట మునిగి మురిగిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ నీటమునిగి తీరని నష్టం వాటిల్లింది.

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి వివిధ పంటలకు త్రీవ నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో 4వేల 594 ఎకరాలల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 3వేల 907 ఎకరాల్లో వరి, 170 ఎకరాల్లో పత్తి, 517 ఎకరాల్లో వేరుశనగ పంటలు నష్ట పోయినట్లు అంచనా వేశారు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 6వేల 420 ఎకరాల్లో నష్టం వాటిల్లగా.. వరి 4 వేల 975 ఎకరాలు, పత్తి 14వందల 20 ఎకరాలు, మొక్కజొన్న 25 ఎకరాల వరకు నష్టం జరిగింది.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్లెదుటే వరద నీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. చేతికి అందొచ్చిన పంటలు.. నీటిపాలు కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు అవన్నీ తీర్చేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రభత్వం తక్షణమే నష్ట పరిహారం అంచనా వేసి, ఎకరానికి 50వేలు చెల్లించి, తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 

Tags:    

Similar News