తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో ఈ రోజు ఎస్ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో 22 వేల మంది ఆశా వర్కర్లు, 500 మంది ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భరోసా కల్పించండి - ప్రాణాలు కాపాడండి అని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు పిలుపునిచ్చారు. ఈ 6 నెలల అనుభవంలో కరోనాకు చంపే శక్తి లేదని తెలిసిపోయిందన్నారు. కరోనా సమయంలో హెల్త్ వారియర్స్ కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారని ప్రశంసించారు. 99 శాతం మంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ప్లాస్మా థెరపీ చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి అతి త్వరలోనే కరోనాకు అడ్డుకట్ట వేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒక్కటే. భయం లేకుండా ఉంటే కరోనాను జయించొచ్చు అని మంత్రి స్పష్టం చేశారు.
ఇతర సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి.. సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలన్నారు. ఈ ధైర్యాన్ని ప్రజలందరికీ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అనవసరంగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు. కరోనా విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టం అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ర్యాపిడ్ పరీక్షలో నెగిటివ్ ఫలితం వచ్చిన వారికి లక్షణాలు ఉంటే.. తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి ఈటల సూచించారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను ముందే గుర్తించగలిగితే కరోనాను అరికట్టవచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు అని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను అరికట్టడం సాధ్యమని సీఎం కేసీఆర్ భావించారు.