Kondagattu: కొండగట్టు క్షేత్రం హనుమాన్‌ చాలీసాతో మారుమ్రోగింది

Kondagattu: రామ లక్ష్మణ జానకి.. జైబోలో హనుమానుకి అనే నినాదం దేవాలయ ప్రాంగణంలో హోరెత్తింది

Update: 2021-03-18 09:13 GMT

కొండగట్టు (ఫైల్ ఫోటో)

Kondagattu: కొండగట్టు క్షేత్రం హనుమాన్‌ చాలీసాతో మారుమ్రోగింది. రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానుకి అనే నినాదం దేవాలయ ప్రాంగణంలో హోరెత్తింది.

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో 82 రోజుల నిరంతర హనమాన్‌చాలీసా పఠన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ కవిత. కొండగట్టు ఆంజనేయ దేవాలయ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా 10 వేలకి పైగా దేవాలయాల్లో నిత్యం చాలిసా పారాయణం జరుగనుంది. దీని కోసం కొండగట్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. కొండగట్టు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

చాలీసా పారాయణంతో కొండగట్టు ఆలయం ప్రాంగణం అంతా సీతారామ ఆంజనేయ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పదకొండుసార్లు హనుమాన్ చాలీసా పారాయణంతో కొండగట్టు క్షేత్రంలో పండగ శోభ నెలకొంది. స్వామి వారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. కొండగట్టులో రెండు మండల కాలం పాటు అంటే 82 రోజుల పాటు ఈ పారాయణ కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు 11 సార్లు చాలీసా పారాయణం చేయనున్నారు.

చాలిసాతో పాటుగా ఈ 82 రోజుల్లో 11 కోట్ల రామ కోటి పుస్తకాలని కూడా స్వామి వారికి సమర్పించనున్నారు. రామ కోటి రాస్తున్న భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు శ్రీరామ కోటి స్థూపాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేస్తున్నారు.

మరో వైపు రాష్ట్రమంతట భక్తులు హనుమాన్ దీక్షలు తీసుకునే సమయం కావడంతో రానున్న రోజుల్లో ఈ కార్యక్రమనికి కొండగట్టులో భారీగా భక్తులు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల్లో కొండగట్టు ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 

Tags:    

Similar News