Hyderabad: గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గర గన్ ఫైరింగ్‌

బ్యాంక్ సెక్యూరిటీ గార్డుల మధ్య గొడవ కోపంతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ మూడు రౌండ్ల కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు

Update: 2021-07-14 11:18 GMT

గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ బ్యాంక్ (ఫైల్ ఫోటో) 

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి గన్‌ పేలింది. గన్‌ఫౌండ్రీలో తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి. దాంతో, అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక భయంతో జనం ఉరుకులు పరుగులు పెట్టారు.

హైదరాబాద్‌‌ గన్‌ఫౌండ్రీ దగ్గరున్న ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గర ఈ కాల్పులు జరిగాయి. బ్యాంక్ సెక్యూరిటీ గార్డుల మధ్య జరిగిన గొడవ చివరికి కాల్పులకు దారి తీసింది. ఒక సెక్యూరిటీ గార్డు కోపం పట్టలేక ఫైరింగ్ ఓపెన్ చేయడంతో. మూడు రౌండ్ల బుల్లెట్లు దూసుకొచ్చాయి. దాంతో, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు సర్దార్ ఖాన్‌, సురేందర్‌ మధ్య గొడవ జరిగింది. దాంతో, సర్దార్‌ తన బోర్‌ గన్‌తో ఫైరింగ్ ఓపెన్ చేశాడు. మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో బుల్లెట్లు సురేందర్ శరీరంలో నుంచి దూసుకెళ్లాయి. తీవ్ర గాయాల పాలైన సెక్యూరిటీ గార్డు సురేందర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

గన్‌ ఫైరింగ్‌పై పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్యాంకు అధికారులు ఇఛ్చిన సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన బోర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రెచ్చగొట్టడం వల్లే తాను కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ నిందితుడు సర్దార్‌ ఖాన్‌ చెప్పినట్లు ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. గాయపడిన సురేందర్‌ను అపోలో ఆస్పత్రికి తరలించామన్న ఏసీపీ వెంకట్‌ రెడ్డి కాల్పులకు దారితీసిన కారణాలపై సర్దార్‌‌‌ను ప్రశ్నించినట్లు తెలిపారు.

Tags:    

Similar News