Guru Purnima Celebrations 2024: తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ..ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
Guru Purnima Celebrations 2024: నేడు గురుపౌర్ణమి..తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఇరు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటున్నారు.
Guru Purnima Celebrations 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి సందర్బంగా సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణరాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, దిల్ షుక్ నగర్, వరంగల్లోకి ఆలయాలకు భారీగా భక్తులు చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. ఈవిధంగా పలు ప్రాంతాల్లో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలను జరుపుకుంటున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు.
సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడమే అనవాయితీగా వస్తుంది. అజ్నానం అనే అంధకారంలో నుంచి విజ్నాన జ్యోతులను వెలిగించే వ్యక్తి గురువు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా నిర్వహించడం మన దేశంలో ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా గురుపౌర్ణమిని భావిస్తారు.
కాగా దిల్ షుక్ నగర్ సాయిబాబా దేవాలయంలో భక్త జనసందోహం నెలకొంది. తెల్లవారుజాము నుంచి సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి బారులు తీరారు. మరోవైపు ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లోని సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి శోభ కనిపిస్తోంది.