Telangana: తెలంగాణలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
Telangana: గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీఆర్ఎస్ * దుబ్బాక ఓటమీని రిపీట్ కాకుండా ఉండేందుకు వ్యూహ రచన
Telangana: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.. బలమైన నాయకులు బరిలో ఉండడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరికి విజయం వరిస్తుందనేది అత్యంత ఆసక్తిని రేపుతోంది.. చివరి నిమిషంలో పీవీ నరసింహారావు కూతురుకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టేందుకు పీవీ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడంతో ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది.. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో చతుర్ముఖ పోటీ నెలకొంది..
తెలంగాణలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు పట్టాభద్రుల కోటాలో ఎన్నిలకు జరగనున్నాయి. అందుకోసం అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాన్ని ఎప్పుడు గెలవని టిఆర్ఎస్ ఇప్పుడు సరికొత్త వ్యూహం తో ముందుకెళ్తుంది. ముందుగా టిక్కెట్ కోసం ప్రయత్నించిన వారికి కాకుండా.. మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవికి టిక్కెట్ ఇవ్వడంతో ఈ ఎన్నికలు మరింత హీట్ పెంచాయి.
పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కావడంతో.. ఆయన కూతురుకు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడం గులాబీ బాస్ వ్యూహ రచనలో భాగమంటున్నారు.. కాంగ్రెస్ సానుభూతి పరులను ఆకర్షించేందుకు కేసీఆర్ ఆలోచించారని భావిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్ది రాంచందర్‌రావుది టీఆర్ఎస్ అభ్యర్ది వాణీదేవీ ఓకే సామాజిక వర్గం కావడంతో బీజేపీకి చెక్ పెట్టి రాజకీయంగా కలిసి వస్తుందనే అంచనాలో గులాబీ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ తరుపున మహిళకు టిక్కెట్ ఇవ్వడంతో ఒక్కసారిగా అంచనాలు మారాయి...
కాంగ్రెస్ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, టిఆర్ఎస్ నుంచి సురభి వాణి దేవి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఛతుర్ముఖ పోటీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కారు పార్టీ నేతలకు సూచించారు.
ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నిక కూడా గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, జయసారథిరెడ్డి, రాణిరుద్రమ, తీన్మార్ మల్లన్న బరిలో ఉండడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. గడిచిన మూడు నెలల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ హోరాహోరీ పోటీ తప్పేట్లు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కావడం తో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించడం టిఆర్ఎస్‌కు బిగ్ టాస్క్‌గా మారింది.
దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కక పోవడం తో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది.. అందుకే సీఎం కేసీఆర్ తో పాటు కెటీఆర్ ఈ ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి సారించారు.