Bhadrachalam: గోదావరి ఉగ్రరూపం.. 70 అడుగులు దాటిన నీటిమట్టం..
Godavari Floods: ఏళ్ల చరిత్రను తిరగరాసింది. గోదావరి మహోగ్రరూపంగా ప్రవహిస్తోంది.
Godavari Floods: ఏళ్ల చరిత్రను తిరగరాసింది. గోదావరి మహోగ్రరూపంగా ప్రవహిస్తోంది. రోజుల తరబడి వర్షాలు కురవడం ఎగువప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో భద్రాచలం దగ్గర గోదావరి నది తీవ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. నదీ ప్రవాహం ఏకంగా 70 అడుగులు దాటడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు భద్రాచలం పట్టణం కూడా ముంపు భయాన్ని ఎదుర్కొంటోంది. 30 ఏళ్లల్లో 70 అడుగులకు నీటిమట్టం చేరడం ఇది రెండోసారి అని అధికారులు చెబుతున్నారు.
భద్రాచలం వంతెనపై రాకపోకలు నిషేధించగా 144 సెక్షన్ విధించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఇక భద్రాచలం ఏజెన్సీలో ఏకంగా 250 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరదముంపునకు గురయ్యాయి. తీరం వెంబడి ఉన్న ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ నీటమునిగాయి. డ్రోన్‌తో చిత్రీకరించిన వీడియోలో పట్టణం పూర్తిగా జలమయం అయినట్లు కనిపిస్తోంది. గోదావరి ప్రకోపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ డ్రోన్ విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది.