మహోగ్రంగా గోదావరి.. వరద ముంపులో గ్రామాలు, నీట మునిగిన పంటలు
Godavari Floods: గోదావరి మరోసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువలో వరదల ప్రభావం వల్ల ఈ తీవ్రత వచ్చింది.
Godavari Floods: గోదావరి మరోసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువలో వరదల ప్రభావం వల్ల ఈ తీవ్రత వచ్చింది. దీనివల్ల వందల గ్రామాల్లోకి వరద నీరు చేరగా, 80 వరకు పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు సుమారుగా 12వేల హెక్టార్లలో పంట మునిగినట్టు వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నారు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. రికార్డు స్థాయి ప్రవాహాలను నమోదుచేస్తూ గంటగంటకూ వరద ఉధృతితో పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద ఏడేళ్ల తర్వాత గోదావరి 61.6 అడుగుల నీటి మట్టంతో ఉరకలెత్తుతోంది. ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి నదులతో పాటు చర్ల మండలంలోని తాలిపేరు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 20.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితిగా కేంద్ర జలవనరుల సంఘం ప్రకటించింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమ వారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
కాగా, గోదావరి ఉధృ తంగా ప్రవహిస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, మణు గూరు, అశ్వాపురం, బూర్గం పాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని సుమారు 120 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. రహదారులు మునిగిపోవడంతో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 39 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,036 కుటుంబాలకు చెందిన 3,387 మందిని ఆయా కేంద్రాలకు తరలించారు.
వరద కారణంగా జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 5,630 మంది రైతులకు చెందిన 11,777 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో వరి, పత్తి అధికంగా ఉన్నాయి. 4,033 మంది రైతులకు చెందిన 8,055 ఎకరాల్లో వరి, 1,586 మంది రైతులకు చెందిన 3,703.54 ఎకరాల్లో పత్తి వరద పాలైంది. ఇక అశ్వాపురం మండలం సీతారామ ఎత్తిపోతల పథకం కాలువల్లోకి, బీజీకొత్తూరు వద్ద ఉన్న మొదటి పంప్‌హౌస్‌లోకి భారీగా నీళ్లు చేరాయి. మణుగూరు, పినపాక మండలాల మధ్య నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చుట్టూ గోదావరి నీటితో నిండింది. పరీవాహక మండలాల్లో ఎటుచూసినా జలమయమే.
ప్రాజెక్టులకు జలకళ
వరద ఉధృతి పెరగడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 64 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో నిల్వ 90 టీఎంసీలకు 50.24 టీఎంసీలకు చేరింది. లోయర్ మానేరులోకి సైతం 19 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, నిల్వ 24.07 టీఎంసీలకు 17.67 టీఎంసీలకు చేరింది. 25.87 టీఎంసీల మిడ్‌మానేరులో నిల్వ 21.31 టీఎంసీలకు చేరగా, 14 వేల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లిలో సైతం 20.18 టీఎంసీలకు 18.98 టీఎంసీల నిల్వ ఉంది.
2013 తర్వాత ఇప్పుడే భారీ ప్రవాహం
భద్రాచలం వద్ద ఏడేళ్ల తర్వాత ఇంత ప్రమాదకర స్థాయిలో గోదావరి నీటిమట్టం నమోదు కావడం ఇదే ప్రథమం. 2013 ఆగస్టు 3న భద్రాచలం వద్ద 61.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. మళ్లీ ఇప్పుడు 61.6 అడుగులు వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరికి 1986 ఆగస్టు 16న 75.6 అడుగులు, 1990 ఆగస్టు 24న 70.8 అడుగులు, 2006 ఆగస్టు 6న 66.9 అడుగులు, 1976 జూన్ 22న 63.9 అడుగులు, 1983 ఆగస్టు 14న 63.5 అడుగులు, 2013 ఆగస్టు 3న 61.6 అడుగులు, 2016 జూలై 12న 52.4 అడుగులు నీటిమట్టాలు నమోదయ్యాయి.
ప్రమాద హెచ్చరికలు ఇలా..
– 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక.. ఈ స్థాయి ప్రవాహం వచ్చినప్పుడు గోదావరి గట్టు దాటి ప్రవహిస్తుంది. లంక భూములు మునిగిపోతాయి. ఈ క్రమంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
– 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక.. గోదావరి వరద ఈ స్థాయిలో వచ్చినప్పుడు చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం మండలాల్లోని పంట భూములను వరద నీరు ముంచెత్తుతుంది.
– 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక.. దీన్ని డేంజర్ లెవెల్‌గా ప్రకటిస్తారు. 53 అడుగుల నుంచి ఒక్కో అడుగు పెరుగుతున్నకొద్దీ మరింత ప్రమాదం పెరుగుతున్నట్లే. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ స్థాయికి వచ్చినప్పుడు పరీవాహక పినపాక, భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని సుమారు 120 గ్రామాల్లోకి నీరు చేరుతుంది. 60 గ్రామాలకు వెళ్లే రోడ్లు మునిగిపోయి రాకపోకలు బంద్ అవుతాయి. ముంపు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ప్రస్తుతం ఉన్న 61.6 అడుగుల నుంచి నీటిమట్టం మరో అడుగు పెరిగితే బూర్గంపాడు మండల కేంద్రం సైతం ద్వీపంగా మారుతుంది.