GHMC mayor election: మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ నుంచి ఆరుగురి పేర్లు
*టీఆర్ఎస్‌లో మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ *రేసులో ఆరుగురు కార్పొరేటర్ల పేర్లు *మేయర్ అభ్యర్ధిగా వినిపిస్తోన్న సింధూ ఆదర్శ్‌రెడ్డి పేరు
టీఆర్ఎస్ లో మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మొదటి నుంచి భారతీనగర్ కార్పోరేటర్ పేరు సింధూ ఆదర్శ్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే, తాజాగా ఈ జాబితాలో గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలతారెడ్డి పేర్లు చేరాయి. తెలంగాణ ఉద్యమం నుంచి సీఎం కేసీఆర్ తో పనిచేసిన మోతే శోభన్ రెడ్డి సతీమణీ శ్రీలతారెడ్డికి మేయర్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది శ్రీలతారెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, బంజారాహిల్స్ కార్పొరేటర్, కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి కూడా తనకు మేయర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గతంలో తనకు ఎమ్మెల్యేగా టికెట్ రాకపోవడంతో మేయర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సిట్టింగ్ మేయర్ బొంతు రామ్మోహన్ తన సతీమణీ శ్రీదేవికి అవకాశం ఇవ్వాలని సీఎంతోపాటు మంత్రి కేటీఆర్‌ను కలిసి కోరారు. అయితే, ఇందులో బొంతు శ్రీదేవి, మోతే శ్రీలతారెడ్డి తప్ప మిగిలిన వారంతా రెండోసారి గెల్చినవారే. ఇక డిప్యూటీ మేయర్ గా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కల్గిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ డిప్యూటి మేయర్ బాబా ఫసియుధ్ధీన్ తనకు మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్నారు.