Heavy Rains In Hyderabad : హైద‌రాబాద్‌లో హైఅల‌ర్ట్‌...ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటున్న కమిషనర్

Update: 2020-09-17 13:57 GMT

Heavy Rains In Hyderabad : గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరబాద్ నగరంలో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌ కుమార్. రానున్న‌ మూడు గంట‌ల్లో హైద‌రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. వర్షం పడే సమయంలో, ఆ తర్వాత కూడా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాల‌తో పాటు అన్ని విభాగాల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ అప్ర‌మ‌త్తం చేశారు. గురువారం రాత్రి 3 నుంచి 4 గంట‌ల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు ఎవ‌రు కూడా ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. నగరంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే జీహెచ్ఎంసీ టోల్‌ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-29555500 సంప్రదించాలని లోకేష్‌ కుమార్ చెప్పారు.

ఇక పోతే హైదరాబాద్ నగరంలో బుధ‌వారం రాత్రి కేవలం 2 గంటల్లోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై నడుములోతున వరద నీరు చేరింది. కొద్ది గంటలు పడ్డ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. అంటే నగరంలో ఏ రేంజ్‌లో వానపడిందో అర్థం చేసుకోవచ్చు. వరద ధాటికి హకీంపేట్‌, టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. గురువారం కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఉదయం బాగా ఎండ కాయగా.. సాయంత్రానికి మబ్బులు పట్టి కుండపోత కురుస్తోంది. దీంతో రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News