Ganja Smuggling in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. జిల్లా సరిహద్దులుగా ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలుండటంతో గంజాయి అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలన్న చందంగా సాగుతోంది. విద్యార్థులు, నిరుద్యోగ యువతే లక్ష్యంగా గుట్టు చప్పుడు కాకుండా ఖమ్మం జిల్లాలో సాగుతోన్న గంజాయి మాఫియాపై స్పెషల్ ఫోకస్.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యాపారులు గంజాయి మాఫియాను సాఫీగా సాగిస్తున్నారు. ఉన్నత, మధ్యతరగతి యువత సరదాగా ప్రారంభిస్తున్న గంజాయి వాడకం క్రమేనా వారిని బానిసలుగా మారుస్తోంది. ప్రధానంగా ఉన్నత వర్గాల విద్యార్థులు, నిరుద్యోగ యువత గంజాయికి అలవాటు పడి బతుకును చీకటిమయం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి మత్తులో యువత నేరస్థులుగా మారుతున్నా జిల్లాలో వందల కోట్ల గంజాయి వ్యాపారం యాథేచ్ఛగా కొనసాగుతోన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత ఏ పని చేసేందుకైనా వెనుకాడటం లేదు. ముఖ్యంగా ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాల్లోని మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి మత్తులో రాత్రుళ్లూ బైక్ రేసింగ్ లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాఫియా ముఠాలుగా ఏర్పడి పొరుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా చేస్తూ అడ్డొచ్చినా వారిపై వారి దాష్టీకాన్ని చూపెడుతున్నారు. ఏదేమైనా గంజాయి అక్రమార్కులు కోట్లు గడిస్తూంటే అమాయక యువత మాత్రం వారి భవిష్యత్ ను చీకటిమయం చేసుకుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గంజాయి మాఫియాను కూకటివేళ్లతో సహా పీకివేయాలని కోరుతున్నారు జిల్లావాసులు.