Ganesh Immersion: బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి చాలా క్రేజ్‌

Ganesh Immersion: ప్రతియేటా దూసుకుపోతున్న బాలాపూర్‌ లడ్డూ వేలం పాట

Update: 2021-09-19 04:15 GMT

బాలాపూర్ గణేష్ లడ్డు వేలం (ఫోటో ది హన్స్ ఇండియా)

Ganesh Immersion: బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి చాలా క్రేజ్‌ ఉంది. ఈ లడ్డూను దక్కించుకుంటే తమకు తిరుగుండదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గణనాధుడి లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు. అందుకే ప్రతియేటా దీని ధర దూసుకుపోతోంది. ఈ గణేషుడి లడ్డూ బరువు 21 కిలోలు మాత్రమే. ఐనా, కాంపిటేషన్ మాత్రం చాలా ఎక్కువ. తొలిసారి వందల్లో పలికిన లడ్డూ ధర ఆ తర్వాత ఊహించని రీతిలో లక్షలకు పెరిగిపోయింది.

ప్రతియేటా కొత్త రికార్డులు సృష్టించే బాలాపూర్‌లో వినాయకుడికి లడ్డూ వేలం 1994లో స్టార్టయింది. తొలిసారి ఈ లడ్డు 450 రూపాయలకు వేలంలో కొనుగోలు చేయగా, 1995లో 4 వేల 500కు లడ్డూను దక్కించుకున్నారు. ఇక 1996లో 18వేలకు, 97లో 28 వేలకు లడ్డూను భక్తులు సొంతం చేసుకున్నారు. 1998లో బాలాపూర్‌ గణనాధుడి ప్రసాదం వేలంలో 51 వేల ధర పలికింది. 1999లో 65 వేలకు, 2000లో 66 వేలకు, 2001లో 85 వేలకు భక్తులు లడ్డూను దక్కించున్నారు.

2002లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ ధర తొలిసారి లక్ష రూపాయలు దాటింది. ఆ ఏడాది లక్షా 5 వేలకు లడ్డూను భక్తులు దక్కించుకున్నారు. 2003లో లక్షా 55 వేలు పలికిన లడ్డూ, 2004లో 2 లక్షల ఒక వెయ్యి రూపాయలు పలికింది. 2005లో 2 లక్షల 8 వేలు పలికిన లడ్డూ ధరను 2006లో ఏకంగా 3 లక్షలకు పెంచేశారు. అప్పటివరకు వేలల్లో పెరిగిన లడ్డూ ధర 2007 నుంచి లక్షల్లో పెరుగుతు వచ్చింది. 2007లో 4 లక్షల 15 వేలకు అంటే అంతకుముందు ఏడాదికంటే ఏకంగా లక్షా 15 వేలు అధికంగా పాడి లడ్డూను దక్కించుకున్నారు.

2008లో అంతకు ముందు పలుమార్లు లడ్డూను దక్కించుకున్న భక్తులే 5 లక్షల 7 వేలకు మరోసారి దక్కించుకున్నారు. 2009లో 5 లక్షల 15 వేలకు 2010లో 5 లక్షల 35 వేలకు, 2011లో 5 లక్షల 45 వేలకు సొంతం చేసుకున్నారు బాలాపూర్‌ లంబోదరుడి భక్తులు. ఇక 2012 లో ఏకంగా 7 లక్షల 50 వేలకు భక్తులు ఈ లడ్డూను దక్కించుకోగా… 2013లో ఒక్కసారిగా 2 లక్షలు పెంచేసి 9 లక్షల 26 వేలకు సొంతం చేసుకున్నారు. 2014లో 9 లక్షల 50 వేలకు వేలం పాడగా.. 2015లో 10 లక్షల మార్కును దాటేసింది.

ఇక 2016లో ఏకంగా 4 లక్షలు పెంచి 14 లక్షల 65 వేలకు లడ్డూను దక్కించుకున్నాడు. 2017లో 15 లక్షల 60 వేలకు, 2018లో 16 లక్షల 60 వేలకు, 2019లో 17 లక్షల 67 వేలకు బాలాపూర్ లడ్డూను భక్తులు కైవసం చేసుకున్నారు. ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా ప్రభావంతో వేలం పాటను రద్దు చేశారు. దీంతో అందరి దృష్టి ఈరోజు జరిగే లడ్డూ వేలంపైనే ఉంది. ఈసారి ఎంత ధర పలుకుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News